ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి!

బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శన, ఆన్ లైన్ టికెటింగ్ గురించిన సవరణలను మంత్రి పేర్ని నాని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సినిమా రంగంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ ఈ విషయమై గట్టిగా స్పందించిన పవన్ కళ్యాణ్‌, ఈ సారి తమ పార్టీ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా తమ నిర్ణయాన్ని తెలిపారు. ”పోరాడండి !! ప్రాధేయ పడకండి !! ఇది మీ హక్కు !! ప్రభుత్వం నిర్ణయించడానికి ఇది నిత్యావసర వస్తువు కాదు. పిరికితనం వదిలేయండి. పోరాడితే పోయేదేమీ లేదు” అంటూ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ట్వీట్ చేసింది.

Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాల్సిందిగా కోరారు. ”పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం, తగ్గించిన టికెట్స్ రేట్స్ ను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే మేలు జరుగుతుంది” అని ఓ ప్రకటనలో తెలిపారు. అలానే ‘దేశమంతా ఒకే జీఎస్టీగా టాక్స్ లను ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసమని, దయచేసి ఈ విషయమై పునరాలోచించమని, ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకో గలుగుతుంద’ని చిరంజీవి ఎ.పి. సి.ఎం. జగన్ ఉద్దేశించి ఈ ప్రకటనలో పేర్కొన్నారు. పారదర్శకంగా టిక్కెట్లను ప్రభుత్వమే విక్రయిస్తున్నప్పుడు ఇక షోస్ ను నియంత్రించడం, టిక్కెట్ రేట్లను తగ్గించడం ఎందుకనే ప్రశ్న చాలా మంది బయ్యర్లు వేస్తున్నారు. మరి అధికారంలో ఉన్న పెద్దలు ఈ విషయాలపై పునరాలోచన చేస్తారో లేదో చూడాలి.

Related Articles

Latest Articles