తమ్ముడి మీద కొండంత ప్రేమను చూపిన మెగా హీరో.. పోస్ట్ వైరల్

మెగా మేనల్లుళ్లు, పంజా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మధ్య ఉన్న సోదర ప్రేమ గురించి వర్ణించడం కష్టమే. తమ్ముడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో అన్న సాయి ధరమ్ తేజ్ ప్రయత్నం చాలా గట్టిది. ప్రతి కథలో తాను ఇన్వాల్వ్ అవ్వకుండా వైష్ణవ్ తేజ్ సింగిల్ గా నిర్ణయం తీసుకొనేలా నేర్పించాడు. అతడి సక్సెస్ ని సాయి తేజ్ సెలబ్రేట్ చేశాడు. ఇక వైష్ణవ్ కూడా ఏమి తక్కువ కాదు.. అన్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఇంటి పెద్దగా వ్యవహరించాడు. అన్న కళ్ళు తెరిచి, ఇంటికి వచ్చేవరకు కుటుంబానికి ధైర్యాన్నిచ్చి వెన్నుదండుగా నిలిచాడు. ఇక నేడు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు.. ఈ విషయాలన్నీ తెలుపుతూ అన్న సాయి ధరమ్ తేజ్ స్పెషల్ విషెస్ తెలుపుతూ అన్న ప్రేమను నిరూపించాడు.

” నా ప్రియమైన వైషూ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు. గతేడాది నీ మొదటి సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించి మన కుటుంబానికి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇక గతేడాది చివర్లో నీవు మన కుటుంబానికి పెద్దగా నిలిచి నీ అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నీవు చూపిన బాధ్యత ఎప్పటికీ మర్చిపోలేను. నీకు అన్నయ్యగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎన్నో దెబ్బలు, ఎన్నో ప్రశ్నలు, చర్చలు.. వీటన్నింటిని తట్టుకొని ఎక్కడా షేక్ అవ్వకుండా ఒక రాయిలా నిలబడ్డావు. నేను ఇంటికి వచ్చినప్పుడు నీ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించే మై డియర్ చిన్న తమ్ముడు.. నిన్ను చూసి మేము గర్విస్తున్నాం. దేవుడు నిన్ను చల్లగా చూడాలని, నీకు కావాల్సిన ప్రేమ,ఆనందం, ఉల్లాసం ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ లేఖను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles