పరుపుల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి వినాయకనగర్ బస్తీలోని పరుపుల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలను చూసిన స్థానికులు అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ కమ్మేయడంతో బస్తీ వాసులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు.

గోడౌన్‌లో కాటన్ కు సంబంధించిన వస్తువులు వుండడంతో మంటలు క్షణాల మీద వ్యాపించాయి. పరిశ్రమలో పెద్ద ఎత్తున‌ ఎగసి పడుతున్న మంటలను చూసి కాలనీ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు 8 లక్షల మేరా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అయితే పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. బస్తీ మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ కొనసాగిస్తున్నట్లు బస్తీ వాసుల ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో అనుమతులు లేని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరగరాని ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ స్థానికులు వాపోయారు. పరిశ్రమ యజమాని పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వెంటనే పరిశ్రమ జనావాసాల మధ్య నుండి తొలగించాలని స్థానికులు కోరారు.

Community-verified icon

Related Articles

Latest Articles