ఏకగ్రీవంగా పెద్దలు ఎన్నుకుంటే పోటీ నుండి తప్పుకుంటా: మంచు విష్ణు

‘మా’ ఎన్నికల బరిలో అధ్యక్ష స్థానం కోసం పోటీ పడటానికి సిద్ధమైన మంచు విష్ణు తాజాగా ఓ బహిరంగ లేఖ రాశారు. 2015లోనే దాసరి నారాయణరావు, మురళీమోహన్ ‘మా’ అధ్యక్షుడిగా ఉండమని అడిగితే, తన తండ్రి మోహన్ బాబు ఈ వయసులో ఆ బాధ్యతలు వద్దని గురువుగారిని వారించారని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సొంత భవన నిర్మాణం కోసం గతంలోనే ఇరవై ఐదు శాతం నిధిని తాను ఇస్తానని చెప్పిన మంచు విష్ణు, తాజాగా తన కుటుంబమంతా కలిసి ‘మా’ కార్యాలయాన్ని కట్టిస్తుందని హామీ ఇచ్చాడు. ‘మా’ సొంత భవనం ఆలోచనకు ఇక ఫుల్ స్టాప్ పెట్టి, చిత్రసీమలోని నటీనటులందరికీ ‘మా’ సభ్యత్వం ఇవ్వడం, వారికి తగిన పని కల్పించడంపై దృష్టి పెట్టాలని కోరాడు. తన తండ్రి ఎన్నో సందర్భాలలో సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులకు, కార్మికులకు సాయం చేశారని, అయితే ఒక చేతితో చేసిన సాయం మరో చేతికి తెలియకూడదనే వాటిని తామెప్పుడూ ప్రచారం చేసుకోలేదని అన్నారు.

read also : సెప్టెంబర్ 12న నీట్

‘మా’ ఆవిర్భావం, తదనంతర పరిణామాలు, గడిచిన పాతికేళ్ళలో తన తండ్రి మోహన్ బాబు చేసిన సేవలను నాలుగు పేజీల ఆ లేఖలో తెలిపిన మంచు విష్ణు చివరగా ఓ ప్రతిపాదన పెట్టారు. ఇండస్ట్రీ పెద్దలైన కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, మోహన్ బాబు, మురళీ మోహన్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, జయసుధ, రాజశేఖర్, జీవిత, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు తదితర పెద్దలంతా కూర్చుని ‘మా’ కుటుంబాన్ని నడపడానికి వాళ్ళే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, వారి నిర్ణయాన్ని గౌరవించి తాను పోటీ నుండి తప్పుకుంటానని మంచు విష్ణు తెలిపారు. ఏక గ్రీవం కాని పక్షంలో తాను పోటీ చేస్తానని చెప్పారు. మరి విష్ణు లేఖపై సిని’మా’ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-