ఓ వ్యక్తిని వరించిన అదృష్టం.. బ్యాంకు ఖాతాలో రూ.కోటి డిపాజిట్.. కానీ అంతలోనే…!!

యూకేలోని నార్‌ఫోక్‌కు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. దీంతో అతడి బ్యాంకు ఖాతాలో అనుకోకుండా రూ.1.09 కోట్లు డిపాజిట్ అయ్యాయి. దీంతో ఈ డబ్బును ఏం చేయాలో తెలియక సదరు వ్యక్తి ఇల్లు కొనుగోలు చేశాడు. అయితే ఆ తర్వాత అతడికి కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం పదండి.

Read Also: నమ్మలేని నిజం… దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య

యూకేకు చెందిన రస్సెల్ అలెగ్జాండర్ అనే వ్యక్తికి చెందిన బ్యాంకు అకౌంట్‌లో పలు దఫాలుగా రూ.1.09 కోట్లు డిపాజిట్ అయ్యాయి. తొలిసారి అంటే 2020, డిసెంబర్ 29న రూ.30వేలు డిపాజిట్ కాగా అతడికి అనుమానం వచ్చింది. దీంతో బ్యాంకుకు కాల్ చేయగా.. స్పందన రాలేదు. రెండు వారాల తర్వాత మళ్లీ డబ్బులు డిపాజిట్ అయ్యాయి. దీంతో మళ్లీ బ్యాంకును సంప్రదించాడు. ఈ సారి బ్యాంకు ఉద్యోగి స్పందిచి… డిపాజిట్ అయిన డబ్బు వారసత్వంగా వచ్చిందని.. ఆ డబ్బును అతడు ఉంచుకోవచ్చని బ్యాంకు ప్రతినిధులు సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ డబ్బు చట్టబద్ధమైనదే అని అలెగ్జాండర్ నమ్మాడు. ఆ నిధులకు మరిన్ని డబ్బులు కలిపి రూ.2.36 కోట్లను వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే అలెగ్జాండర్‌కు ఈ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు.

దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మురిగిన సామెత తరహాలో అలెగ్జాండర్ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ అయిన 9 నెలల తర్వాత బ్యాంకు కళ్లు తెరిచింది. డిపాజిట్ చేసిన సొమ్ము అతడిది కాదని గుర్తించింది. దీంతో డిపాజిట్ చేసిన రూ.1.09 కోట్లను వడ్డీ (అదనంగా రూ.6వేలు)తో కలిపి చెల్లించాలని బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. పొరపాటున వేరే వ్యక్తికి చెల్లించాల్సిన సొమ్మును అలెగ్జాండర్‌కు బదిలీ చేశామని బ్యాంకు వెల్లడించింది. దీంతో అలెగ్జాండర్‌కు షాక్ తగిలింది. ఉన్నట్టుండి రూ.కోటి చెల్లించాలంటే ఏం చేయాలో అతడికి పాలుపోలేదు. అసలు ఈ డబ్బే లేకుంటే తాను ఇల్లు కొనుగోలు చేసేవాడిని కాదని గగ్గోలు పెట్టుకున్నాడు. తన భవిష్యత్ ప్రణాళికలను బ్యాంకు దెబ్బతీసిందని ఆవేదన చెందాడు. తాను బ్యాంకు ప్రతినిధులతో సంప్రదించిన తర్వాతే డిపాజిట్ అయిన డబ్బును ఖర్చు చేశానని.. ఇప్పుడు తన పరిస్థితి ఏంటని మొరపెట్టుకున్నాడు. చివరకు ఆ ఇల్లు అమ్మేసి బ్యాంకుకు చెల్లించాల్సిన నగదు ఇచ్చేశాడు. అయితే బ్యాంకు తనకు క్షమాపణ చెప్పాలని, నష్టపరిహారం చెల్లించాలని అలెగ్జాండర్ డిమాండ్ చేశాడు.

Related Articles

Latest Articles