రివ్యూ: వన్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘ది ప్రిస్ట్’ తెలుగు డబ్బింగ్ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఆయన నటించిన ‘వన్’ చిత్రం సైతం శుక్రవారం నుండి తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ఈ రెండు మలయాళ సినిమాలు ఇదే యేడాది మార్చిలో రెండు వారాల వ్యవథిలో థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ‘ది ప్రిస్ట్’లో మానవాతీత శక్తులున్న చర్చి ఫాదర్ గా నటించిన మమ్ముట్టి, ‘వన్’లో ముఖ్యమంత్రి పాత్రను పోషించారు.

‘వన్’ మూవీ పొలిటికల్ డ్రామా. కల్లూరి చంద్రం (మమ్ముట్టి) సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులకు జవాబుదారితనం ఉండాలంటే ‘రైట్ టు రీకాల్’ సిస్టమ్ కరెక్ట్ అని సీఎం భావిస్తుంటాడు. దాన్ని అమలులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంటాడు. సీఎం చంద్రం స్నేహితుడు, పార్టీ అధ్యక్షుడు బాబీ (జోజు జార్జ్) సైతం అందుకు అంగీకరించడు. ఇక ముఖ్యమంత్రిని ఏదో ఒక వంకతో ఆ పదవి నుంచి దించేసి అధికార పీఠంపై కూర్చోవాలని ప్రతిపక్ష నేత జయానంద్ (మురళీ గోపీ)తో పాటు సొంత పార్టీలోని సీనియర్ నాయకులూ కలలు కంటూ ఉంటారు. వాళ్ళకు ‘రైట్ టు రీకాల్’ బిల్లు కంటిలో నలుసుగా మారుతుంది. దాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టగానే, వీగిపోయేట్టు చేసి తద్వారా సీఎం రాజీనామాకు డిమాండ్ చేయాలని పథక రచన చేస్తారు. మరి ప్రజల మేలు కోరి ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ‘రైట్ టు రీకాల్’ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందా లేక అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల పొలిటికల్ గేమ్ కు సీఎం బలి అయ్యారా? అనేది మిగతా కథ.

కేరళ ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అలాంటి రాష్ట్రంలో రైట్ టు రీకాల్ అనే అంశంపై తెరకెక్కిన ‘వన్’ సినిమా ఆదరణ పొందలేదంటే బాధగానే ఉంటుంది. నిజానికి మన దేశంలో ఇలాంటి బిల్లు ఒకటి వస్తే… ప్రజా ప్రతినిధులు అవినీతికి పాల్పడరనే భావన చాలామందిలో ఉంది. కానీ మన వ్యవస్థలోని అనేకానేక లోపాల కారణంగా ఇలాంటి బిల్లును ప్రవేశ పెట్టే సాహసం రాజకీయ నేతలు చేయడం లేదు. ఈ బిల్లును అమలులోకి తీసుకు రావడం అంటే ఎక్కిన కొమ్మను నరుక్కోవడమని వాళ్ళ ఫీలింగ్. బేసికల్ గా ఇలాంటి పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టాలంటే కొన్ని ఆసక్తికరమైన అంశాలను మిళితం చేయాలి. అయితే దర్శకుడు సంతోష్ విశ్వనాథ్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా ప్రారంభమే పేలవంగా ఉంది. ముఖ్యమంత్రి మమ్ముట్టి పాత్ర కూడా అరగంట తర్వాత వస్తుంది. ఆ పైన అయినా కథ చకచకా సాగుతుందా అంటే అదీ లేదు. ఒక సీన్ తర్వాత మరొకటి అలా వస్తూ పోతూ ఉంటాయి. వాట్ నెక్ట్స్ అనే విషయమై ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు చతురత చూపించలేదు.

నటీనటుల విషయానికి వస్తే… ముఖ్యమంత్రి చంద్రం పాత్రలో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయాడు. రెండేళ్ళ క్రితమే ఆయన నటించిన వైయస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ విడుదలైంది. అందులో సీఎం రాజశేఖర్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసిన మమ్ముటి, ఇప్పుడీ ఫిక్షనల్ సీఎం క్యారెక్టర్ ను పోషించాడు. ఆనాడు ‘యాత్ర’లో సమైక్యాంధ్ర సీఎంగా నటించగా, ఇప్పుడీ డబ్బింగ్ సినిమాలో తెలంగాణ సీఎం పాత్రను చేశాడు. ఇతర ప్రధాన పాత్రల్లో జోజు జార్జ్, మురళీ గోపీ, నిమిషా సజయన్, సిద్ధిక్, మాథ్యూ ధామస్ తదితరులు నటించారు. గోపీసుందర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.

ప్రజల కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసే ముఖ్యమంత్రులు ఇవాళ్టి రోజుల్లో లేరు. అలాంటి వారిని వెండితెర మీద చూసి ఆనందించాల్సిందే. ఆ కాస్తంత ఆనందాన్నైతే ‘వన్’ చిత్రం కలిగించింది. ఇలాంటి ఆదర్శవంతమైన పొలిటికల్ డ్రామాస్ గతంలోనూ కొన్ని వచ్చాయి. రాజకీయ చిత్రాలను ఇష్టపడేవారికి, మన పొలిటికల్ సిస్టమ్ లో మార్పు రావాలని కోరుకునే వారికి ‘వన్’ నచ్చే ఆస్కారం ఉంది.

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న పాయింట్
మమ్ముట్టి నటన
గోపీ సుందర్ నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
పొలిటికల్ డ్రామా కావడం
ఆకట్టుకోని కథనం
మూవీ రన్ టైమ్

రేటింగ్: 2.25 / 5

ట్యాగ్ లైన్: ఆదర్శ రాజకీయం!

Related Articles

Latest Articles

-Advertisement-