అభినయంలో జగజ్జెట్టి… మమ్ముట్టి

(సెప్టెంబర్ 7న మమ్ముట్టికి 70 ఏళ్ళు పూర్తి)

మళయాళ చిత్రసీమలో ప్రేమ్ నజీర్ తరువాత సూపర్ స్టార్ స్థానం ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రేమనజీర్ తరం వారు భలేగా పోటీపడ్డారు. కానీ, వారి తరువాత వచ్చిన మమ్ముట్టి ఆ స్థానం ఆక్రమించారు. తనదైన అభినయంతో మమ్ముట్టి అనేక మళయాళ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. తక్కువ పెట్టుబడితోనే చూపరులను కట్టిపడేసేలా చిత్రీకరించడంలో మళయాళ దర్శకులు ఆరితేరినవారు అని ప్రతీతి. మమ్ముట్టి చిత్రాలను మన బడ్జెట్ తో పోల్చి చూస్తే తక్కువగా అనిపించవచ్చు. కానీ, సదరు చిత్రాల్లోని కథాంశం, దానిని నడిపించిన తీరు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంటూ ఉంటాయి. దక్షిణాదిన కమల్ హాసన్ తరువాత మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన ఘనుడు మమ్ముట్టి. తెలుగువారికీ సుపరిచితుడైన మమ్ముట్టి నేటికీ తనదైన బాణీ పలికిస్తూనే ఉన్నారు.

మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. 1951 సెప్టెంబర్ 7న మమ్ముట్టి జన్మించారు. కొట్టాయం జిల్లా వైకోమ్ సమీపంలోని చెంపూలో పెరిగారు. ఆయన తండ్రి ఇస్మాయిల్ హోల్ సేల్ గార్మెంట్స్ షాప్ తో పాటు బియ్యం వ్యాపారం చేసేవారు. ఆరు మంది సంతానంలో మమ్ముట్టి పెద్దవాడు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. లా డిగ్రీ పుచ్చుకున్న మమ్ముట్టి రెండేళ్ళు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. అంతకు ముందు కె.ఎస్. సేతుమాధవన్ రూపొందించిన ‘అనుభవంగళ్ పాలిచకల్’ చిత్రం ద్వారా తెరపై తొలిసారి కనిపించారు మమ్ముట్టి. 1971 నుంచి పలు చిత్రాలలో మమ్ముట్టి నటించారు. 1980లో ‘మేలా’ చిత్రం నటునిగా మమ్ముట్టికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. “ఒరు వాడక్కన్ వీరగాథ, విధేయన్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్” చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమనటునిగా నిలిచారు మమ్ముట్టి. తెలుగులో కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘స్వాతికిరణం’లో తొలిసారి నటించారు మమ్ముట్టి. ఈ సినిమా తరువాత సి.ఉమామహేశ్వరరావు రూపొందించిన ‘సూర్యపుత్రులు’లోనూ అభినయించారు. మమ్ముట్టి హీరోగా ‘రైల్వే కూలీ’ అనే చిత్రం తెలుగులో రూపొందింది. కానీ, అది థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. 2019లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితగాథ స్ఫూర్తితో తెరకెక్కిన ‘యాత్ర’లోనూ మమ్ముట్టి నటించారు. దక్షిణాది భాషల్లోనే కాదు హిందీలోనూ మమ్ముట్టి కొన్ని చిత్రాలలో నటించి అలరించారు.

తన స్వరాష్ట్రం కేరళలో కేన్సర్ రోగుల కోసం కోళీకోడ్ లో ఓ కేంద్రాన్ని నెలకొల్పారు మమ్ముట్టి. రాష్ట్రవ్యాప్తంగా కేన్సర్ రోగులకు ఈ కేంద్రం ఎంతగానో సేవలు అందిస్తోంది. తన చుట్టూ ఉన్నవారికి చేతనైన సాయం చేయడానికి మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. మమ్ముటికి ఇద్దరు పిల్లలు. కూతురు పెద్దది. ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ తండ్రిలాగే నటనలో రాణిస్తున్నాడు. ‘మహానటి’లో నాయిక భర్తగా దుల్కర్ నటించాడు. తనయుడు హీరోగా రాణిస్తున్నా, ఏడు పదుల వయసులోనూ మమ్ముట్టి తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉండడం విశేషం.

Related Articles

Latest Articles

-Advertisement-