బెంగాల్ సీఎం మమతకు తత్వం బోధపడిందా?

ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా కలిసిరావు. ముఖ్యంగా రాజకీయాలకు ఇది అసలు సూట్ కాదు. కొన్నిసార్లు తాత్కాలికంగా పని చేసినట్లు కన్పించినా దాని ప్రభావం దీర్ఘకాలంలో ఉంటుందని రుజువైన సంఘటనలు అనేకం ఉన్నాయి. మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ ఆ పార్టీకి ఒక్క విషయంలో మాత్రం ఆనందం లేకుండా పోయింది. అది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పరాజయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు అధికారంలోకి రావడానికి సర్వశక్తులను ఒడ్డాయి. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన పోలికల్ వార్లో తృణమూల్ కాంగ్రెస్ పైచేయి సాధించింది. ఈ ఎన్నికల్లో మమత బెనర్జీ కాలుకు కట్టుకొని చేసిన ప్రచారం ఒక ఎత్తయితే.. నందిగ్రామ్ లో బరిలో దిగడం మరో ఎత్తయ్యింది. కాలుకు గాయంతో ఆమె ఎన్నికల ప్రచారం చేయడం ఆమెకు కలిసి వస్తే.. నందిగ్రామ్ లో పోటీ చేయడం మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బెడిసి కొట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ వేవ్ గత ఎన్నికల్లో కన్పించింది. నందిగ్రామ్ లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మమతా బెనర్జీ గట్టి పోటీ ఇచ్చినా చివరికీ బీజేపీ అభ్యర్థి సువేందు చేతిలో ఓడిపోక తప్పలేదు. ఈ స్థానం తొలి నుంచి సువేందు అధికారికి కంచుకోటగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీకి నమ్మకమైన వ్యక్తిగా ఉన్న సువేందు అధికారి ఎన్నికల ముందు బీజేపీలో చేరడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమె మొండితనానికిపోయి అతడు పోటీ చేస్తున్న నందిగ్రామ్ నుంచి బరిలో దిగారు.

ఆమెకు రెండుచోట్ల పోటీచేసే అధికారం ఉన్నప్పటికీ ఆమె కేవలం నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్ లో సువేందు అధికారిని ఓడిస్తాననే అతివిశ్వాసంతోనే ఆమె బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 294 స్థానాలకు గాను 213స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాత్రం నందిగ్రామ్ లో ఓటమి పాలవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇప్పుడు ఆమె పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నారు. ఆమె సీఎంగా కొనసాగాలంటే ఆరునెలల్లోపు తిరిగి శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ వైపు చూస్తున్నారు.

మమత కోసమే అక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన శోవన్ దేవ్ చటర్జీ రాజీనామా చేశారు. ఈనెల 30న పశ్చిమ బెంగాల్లో మూడు ఉప ఎన్నికలు జరనుండగా వచ్చే నెల 3న ఫలితాలు రానున్నాయి. భవానీపూర్ నుంచి ఆమె గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కూడా ఆమె గెలువకుంటే ఆమె తన ముఖ్యమంత్రి పదవికే ఎసరు వచ్చే అవకాశం ఉంది. మమత బెనర్జీ తిరిగి తిరిగి భవానీపూర్ కే రావడంతో ఇదేదే అప్పుడే చేస్తే పోయేది కదా? అన్న టాక్ సైతం నడుస్తోంది. ఏదిఏమైనా పశ్చిమ బెంగాల్ కాళీమాతగా పేరుగాంచిన మమత బెనర్జీకి భవానీపూరే కేరాఫ్ అడ్రస్ గా మారబోతుండటం ఆసక్తిని రేపుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-