ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి కన్నుమూత

ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి(96) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1925లో ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖరశాస్త్రి జన్మించారు. పురాణ ప్రవచనాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరు, ప్రఖ్యాతులు పొందారు. భ‌ద్రాచ‌లం శ్రీ సీతారామ క‌ల్యాణ వేడుక‌ల ప్రత్యక్ష వ్యాఖ్యానాల‌లో ఆయ‌న ఉష‌శ్రీతో క‌లిసి పాల్గొన్నారు.

ఉగాది పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహాసాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా ప్రవచనాలు చేయడంతో చంద్రశేఖరశాస్త్రి చాలా ప్రసిద్ధి. దివంగత మహానేత వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంచాంగ శ్రవణం చేశారు. ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లలో ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు. తెలుగు, సంస్కృత భాషల్లో చంద్రశేఖరశాస్త్రికి మంచి ప్రావీణ్యం ఉంది. భారతము ధర్మసుక్ష్మ దర్శనము, కృష్ణలహరి (సేచ్చాంధ్రానువాదము), రామాయణ రహస్య దర్శిని గ్రంథాల‌ను చంద్రశేఖరశాస్త్రి ర‌చించారు. వేదాలు, శ్రౌతస్మార్త, వ్యాకరణతర్క వేదస్త సాహిత్యాల‌ను ఆయన చ‌దివారు.

మల్లాది చంద్రశేఖరశాస్త్రి మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి పరమపదించడం విచారకరమని వెంకయ్యనాయుడు అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా ఆయన ప్రవచనాలు సాగాయని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. అటు మల్లాది చంద్రశేఖరశాస్త్రి అస్తమించారు అనే విషయం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో శాస్త్రి గారు చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికి చిరపరిచితమేనని పవన్ వివరించారు. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, ఆధ్యాత్మిక చింతన పెంచేలా ఆయన ఉపన్యాసాలు సాగేవని తెలిపారు. చంద్రశేఖరశాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles