హుజురాబాద్‌లో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రధాన పార్టీలు…

ఎన్నికలంటేనే బోల్డంత ఖర్చు. పోలింగ్‌ తేదీ ఖరారైతే ఖర్చుకు ఒక లెక్క తెలుస్తుంది. హుజురాబాద్‌లో మాత్రం అంతా రివర్స్‌. ఉపఎన్నిక ఎప్పుడో తెలియదు. 2 నెలలుగా ప్రధాన పార్టీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప ఎలక్షన్‌ ఎప్పుడో.. ఏంటో.. క్లారిటీ లేదు? ఇంకా ఎన్ని రోజులు.. ఎంత ఖర్చు పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారట నేతలు.

వందల మందితో కలిసి ఎన్నికల ప్రచారం!

హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఎప్పడు ఎన్నిక తేదీ ప్రకటిస్తారో స్పష్టత లేదు. ఆగస్టులోనే షెడ్యూల్‌ వస్తుందని ప్రచారం జరిగినా.. ఇప్పుడు సెప్టెంబర్‌లోకి వచ్చేశాం. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. కానీ.. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజీనామా చేసినప్పుడే అక్కడ వేడి రాజుకుంది. ఆ రోజు నుంచే అంతా ఎన్నికల గోదాలోకి దిగిపోయారు. వందల మంది అనుచరులతో కలిసి ఊరూరా తిరిగేస్తున్నారు.

ఎన్నికల ఖర్చు భరించడం ఎలాగో తెలియడం లేదా?

చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయింది. ఒక మోస్తరు సమావేశాలు, ర్యాలీలు, చేరికలు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా కార్యక్రమాలను ప్లాన్‌ చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఎన్నికల హడావిడి అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. రెండు నెలలుగా ప్రధాన పార్టీలు కోట్లు కుమ్మరించాయి. సాధారణంగా తొందరగా ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చి.. పోలింగ్ పూర్తి కావాలని పార్టీలు కోరుకుంటాయి. హుజురాబాద్‌లో భిన్నమైన పరిస్థితి ఉంది. ఎప్పుడు తేదీ ప్రకటిస్తారో తెలియదు. అప్పటి వరకు ఎన్నికల ఖర్చు భరించడం ఎలాగో పార్టీలకు అర్థం కావడం లేదు. డబ్బు తీయకపోతే అనుచరులు, కేడర్‌ వెంట రారు. సంఖ్య ఏమాత్రం తగ్గినా.. పనైపోయిందని వైరివర్గాలు వెంటనే ప్రచారం మొదలుపెట్టేస్తాయి. దాంతో సంఖ్య ఎక్కువగా ఉండాలని.. లెక్క ఎంతైనా ఫర్వాలేదని పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు.

చూస్తుండగానే నెలలు గడిచిపోతోంది!

ఉదయం బయటకు వచ్చినప్పట్టి నుంచి రాత్రి ఇంటికి చేరే వరకు సందడి సందడిగా రాజకీయ వాతావరణం ఉండాలి. అలా ఉండలంటే జెండాలు, కార్యకర్తలు, బ్యాండ్ అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వారి తిండి.. బత్తా.. బస ఇలా చాలా ఖర్చు ఉంటుంది. 15 రోజులో ఒక నెల రోజులో అంటే ఒకే కానీ.. ఇక్కడ నెలలు గడిచిపోతోంది. ఇంకా ఎన్నాళ్లిలా అన్నది క్లారిటీ లేదు. అసలు ఉపఎన్నిక నాటికి జేబులు.. బ్యాంక్‌ ఖాతాలు.. బ్లాక్‌ ఖాతాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని బరిలో ఉన్న అభ్యర్థులు బెంగ పెట్టుకున్నారట.

ఎన్నికల తేదీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూపులు!

టీఆర్‌ఎస్‌, బీజేపీ శిబిరాలలోని నాయకులు పైకి చెప్పకపోయినా.. ఆంతరింగక సమావేశాల్లో ఎన్నికల బడ్జెట్‌పైనే ఎక్కువ చర్చ జరుగుతోందట. రోజువారీ ఖర్చు పెరిగిపోతుండటంతో… సర్దుబాటు చేయాలంటే తలప్రాణం తోకకు వస్తోందట. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం వైపు ఆశగా చూస్తున్నారట అభ్యర్థులు. ఆ తేదీ ఏదో ప్రకటించేస్తే తొందరగా ఖర్చుల ఊబిలో నుంచి బయటపడొచ్చని అనుకుంటున్నారట. కనిపించిన దేవుళ్లకు మొక్కుకుంటున్నారట. మరి.. వారి ప్రార్థన ఫలిస్తుందో లేదో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-