దసరా తర్వాత కాంగ్రెస్ లో పెనుమార్పులు?

దేశాన్ని అత్యధిక కాలం పాలించిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్సే. ఈ రికార్డును దేశంలోని ఏ రాజకీయ పార్టీ బ్రేక్ చేసే అవకాశం కనుచూపు మేరల్లో కన్పించడం లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ గడిచిన దశాబ్దకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంద్రంలో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అధికారానికి దూరమవడంతో ఆ ప్రభావం క్రమంగా రాష్ట్రాలపై పడుతోంది. దీంతో క్రమంగా ఆయా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్రమంగా పట్టును కోల్పోవాల్సి వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం పార్టీని గాడినపట్టేందుకు రెడీ అవుతోంది.

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తాచాటడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈక్రమంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళుతోంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఒక్క పంజాబ్లో అధికారంలో ఉంది. దీంతో ఇక్కడ ఎలాగైనా తిరిగి అధికారాన్ని దక్కించుకోవడంతో మిగిలిన రాష్ట్రాల్లోనూ సత్తాచాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

ఇందులో భాగంగానే ఇటీవల పంజాబ్లో సీఎం అభ్యర్థిని సైతం మార్చివేసి కాంగ్రెస్ అందరికీ షాకిచ్చింది. అమరీందర్ సింగ్  స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ ను ముఖ్యమంత్రి చేసింది. ఈ వ్యవహారం పైకి బాగానే కన్పిస్తున్న లోలోపల మధ్య ఆధిపత్య పోరుకు తెరతీసింది. సీఎం మార్పు పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని భావించగా మైనస్ గా మారుతుండటంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. అలాగే పార్టీలో పెరుగుతున్న అసమ్మతి గళం, సీనియర్ల వ్యతిరేకతను దూరం చేసేలా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే అక్టోబర్ 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది.

సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పనిలో పనిగా రాహుల్ గాంధీకి తిరిగి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంపై పార్టీ పెద్దలు చర్చించనున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుండటంతో సీనియర్లు సైతం ఈ ప్రతిపాదనను అంగీకరించే అవకాశం కన్పిస్తుంది. గతంలోనే 23మంది కాంగ్రెస్ సీనియర్లు పార్టీకి వ్యతిరేకంగా లేఖస్త్రాన్ని సంధించారు. వీరంతా ఇప్పుడు సైలంటయ్యారు. ఈక్రమంలోనే పార్టీని మళ్లీని గాడినపెట్టేందుకు అధిష్టానం రాహుల్ కు బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది.

కాంగ్రెస్ కొద్దిరోజులుగా నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. మోదీ హవా ముందు కాంగ్రెస్ తేలిపోతుంది. అయితే గత కొంతకాలంగా మోదీ ఇమేజ్ మసకబారుతోంది. ఇదే సమయంలో రాహుల్ ఇమేజ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో రాహుల్ గాంధీని తిరిగి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామించాలనే డిమాండ్ కొంతకాలంగా పార్టీలో విన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై చర్చించనున్నారని సమాచారం. మొత్తానికి దసరా తర్వాత కాంగ్రెస్ లో పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

-Advertisement-దసరా తర్వాత కాంగ్రెస్ లో పెనుమార్పులు?

Related Articles

Latest Articles