ముగిసిన మిస్టర్ ఇండియా పోటీలు.. విజేత ఎవరంటే..?

తెలంగాణలోని ఖమ్మంలో గత రెండు రోజులుగా ‘మిస్టర్ ఇండియా’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహారాష్ట్ర ఇంకమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు చెందిన సాగర్ కతుర్డె ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన ఆర్.కార్తికేశ్వర్, శర్వణన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టీమ్ ఛాంపియన్ షిప్‌లో ఇండియన్ రైల్వేకు ప్రథమ స్థానం లభించగా తమిళనాడు జట్టుకు ద్వితీయ స్థానం లభించింది. విన్నర్‌గా నిలిచిన ఇండియన్ రైల్వేస్ టీమ్ 225 పాయింట్లు సాధించగా… రన్నరప్‌గా నిలిచిన తమిళనాడు 130 పాయింట్లు సంపాదించింది. మూడో స్థానంలో నిలిచిన సర్వీసెస్ కంట్రోల్ బోర్డు ఖాతాలో 120 పాయింట్లు ఉన్నాయి.

Read Also: ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా యువ క్రికెటర్

రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 532 మంది బాడీ బిల్డర్లు పోటీ పడ్డారు. ఎత్తు, బరువు, వ్యక్తిగత విభాగాలు కలిపి మొత్తం 10 విభాగాల్లో మిస్టర్ ఇండియా పోటీలను నిర్వహించారు. అటు హర్యానాకు చెందిన నితిన్ చండిలా మోస్ట్ ఇంప్రూవ్డ్ అథ్లెట్‌గా ఎంపికయ్యాడు. బెస్ట్ పోజర్‌గా తపాలా శాఖకు చెందిన కృష్ణారావు అవార్డు అందుకున్నారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా జడ్జి పి.చంద్రవేఖర్‌ప్రసాద్, భారత బాడీబిల్డింగ్ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles