‘అన్ లాక్ సినిమా, సేవ్ జాబ్స్’ అంటున్న మహారాష్ట్ర ఎగ్జిబిటర్స్

దేశంలోనే అతిపెద్ద సినిమా రంగం బాలీవుడ్! దానికి కేంద్రం ముంబై! కరోనా సెకండ్ వేవ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు పునః ప్రారంభమైనా మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని మహారాష్ట్ర మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా సభ్యులు వాపోతున్నారు. నెలకు నాలుగు వందల కోట్ల నష్టం వస్తోందని, గత యేడాది మార్చి నుండి ఇప్పటి వరకూ సుమారు రూ. 4, 200 కోట్ల రూపాయలు లాస్ వచ్చిందని వారు చెప్పారు. ‘అన్ లాక్ మహారాష్ట్ర’లో భాగంగా ఇటీవల లోకల్ ట్రైన్స్, బీచ్ లు, పార్కులను కూడా ఓపెన్ చేసేశారు. కానీ సినిమా థియేటర్ల విషయంలో మాత్రం ప్రభుత్వం చొరవ చూపడం లేదు.

ఇప్పటికే మాల్స్, ఎయిర్ లైన్స్, రైల్వేస్, రీటైల్స్, జిమ్స్ కు ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఇప్పుడు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకుని, సినిమాలను ప్రదర్శిస్తామంటే తమకు అవకాశం ఇవ్వడం లేదని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు. కోట్లాది మందికి వినోదాన్ని అందించేది సినిమానే అని, అలానే ఈ రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. ‘అన్ లాక్ సినిమా, సేవ్ జాబ్స్’ నినాదంతో తమను ఆదుకోమంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞాపన ప్రతాన్ని మంగళవారం పంపారు. సినిమా ప్రదర్శన సమయంలో తీసుకునే జాగ్రత్తలన్నింటినీ అందులో పొందుపరిచారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో భాగమైన పీవీఆర్, ఐనోక్స్, సినీపోలిస్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం ఎంతవరకూ పట్టించుకుంటుందో చూడాలి.

'అన్ లాక్ సినిమా, సేవ్ జాబ్స్' అంటున్న మహారాష్ట్ర ఎగ్జిబిటర్స్

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-