40 ఏళ్ళ ‘మహాపురుషుడు’

కొన్ని సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ టైటిల్స్ సదరు చిత్రాల హీరోల ఇమేజ్ ను పెంచుతూ ఉంటాయి. నటరత్న యన్.టి. రామారావు సినిమాలలో అలాంటివి చాలా టైటిల్స్ ఉన్నాయనే చెప్పాలి. జనం మదిలో ‘యుగపురుషుడు, మహాపురుషుడు’ అన్న రీతిలో నిలచిపోయారు యన్టీఆర్. ఆ రెండు టైటిల్స్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ నటించి అలరించారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘మహాపురుషుడు’ చిత్రం 1981 నవంబర్ 21న జనం ముందు నిలచింది.

‘మహాపురుషుడు’ కథ విషయానికి వస్తే – యన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్ళుగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘రక్తసంబంధం’కు మరో వర్షన్ లా ఉంటుంది. ఇందులో హీరో విజయ్ పారిశ్రామిక వేత్త. అతనికి చెల్లెలు లక్ష్మి అంటే ప్రాణం. మురళిని లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తన చెల్లెలి ఇష్టాన్ని కాదనని విజయ్, ఆమె అత్తవారింట సుఖంగా ఉండాలని ఆమె కోరకుండానే అన్నీ సమకూరుస్తుంటాడు. అయినా, మురళి తల్లి కాంతమ్మ, లక్ష్మిని కష్టాల పాలు చేస్తూనే ఉంటుంది. కాంతమ్మ అలా ప్రవర్తించడానికి ఆమె కూతురు కూడా కారణం. చివరకు లక్ష్మి కంటి చూపు కూడా పోతుంది. చెల్లెలి కాపురం నిలపడానికి విజయ్ పూనుకుని, మురళి కళ్ళు తెరిపిస్తాడు. లక్ష్మికి కంటి చూపు రావడంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో యన్టీఆర్ చెల్లెలిగా సుజాత, మురళిగా మురళీమోహన్ నటించారు. యన్టీఆర్ జోడీగా జయసుధ నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, పద్మనాభం, పి.ఎల్.నారాయణ, సూర్యకాంతం, మమత, ఈశ్వరరావు, జగ్గారావు ఇతర పాత్రల్లో కనిపించారు. జయమాలిని ఓ ఐటమ్ సాంగ్ లో చిందేసి కనువిందు చేశారు. అంతకు ముందు 1976లో యన్టీఆర్ తో ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మించిన ప్రముఖ కళాదర్శకుడు రాజేంద్రకుమార్ సమర్పణలో ఆదిత్య చిత్ర పతాకంపై ‘మహాపురుషుడు’ తెరకెక్కింది. ఈ చిత్రానికి వి.మహేశ్, వి.రోషిణి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి నిర్మాత మహేశ్ కథ సమకూర్చగా, జంధ్యాల మాటలు రాశారు. లక్ష్మీదీపక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

చక్రవర్తి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో సి.నారాయణ రెడ్డి, వేటూరి, గోపి పాటలు పలికించారు. “శ్రీ కృష్ణా…”, “మంగమ్మత్త కూతురా… మల్లెపూల జాతర… “, “తొలిసారి వాలుచూపు…”, “కోవెల దీపములా…”, “బోణీ కొట్టు బేరం వద్దు…”, “ప్రతి వసంత వేళలో…”, “చిలకలూరి పేట చిన్నదాణ్ణి…” పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ముందు యన్టీఆర్ నటించిన ‘కొండవీటి సింహం’ సినిమా జైత్రయాత్ర చేస్తూ ఉంది. ఆ ఘనవిజయం మోతలో ‘మహాపురుషుడు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Related Articles

Latest Articles