వేటగాళ్ళ దాహానికి బలవుతున్న వన్యప్రాణులు

అడవుల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. గోళ్లు, చర్మం కోసం పెద్ద పులులను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేటగాళ్ల దుర్మార్గానికి మరో పెద్దపులి బలైంది. మహారాష్ట్రలో వేటగాళ్ల ఉచ్చుకు మరో పెద్దపులి ప్రాణాలు కోల్పోయింది. గడ్చిరోలి జిల్లా అయిరి తాలుకాలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్దపులి మృతిచెందింది.

అనంతరం వేటగాళ్లు పులి కాళ్లు, తల తీసుకుని.. మొండాన్ని అదేచోట పూడ్చిపెట్టారు. డిసెంబర్ 30న అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సిబ్బందికి దుర్వాసన రావడంతో పరిశీలించగా.. పులి కళేబరం కనిపించింది. మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు, పోలీసులతో పాటు కుమురం భీం జిల్లా అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టడంతో.. ముఠా గుట్టు రట్టైంది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. కాంతారాం అనే వేటగాడి దగ్గరి నుంచి ఒక పులిగోరును, మహారాష్ట్ర వేటగాళ్ల దగ్గర నుంచి 8గోళ్ళను స్వాధీనం చేసుకున్నారు.

మోసం గ్రామానికి చెందిన ఐదుగురు.. దిగిడ గ్రామానికి చెందిన నలుగురు మోసం అటవీ ప్రాంతలో డిసెంబరు 25న విద్యుత్తు తీగలను అమర్చారని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు.. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు ఆసిఫాబాద్‌ డీఎఫ్‌ఓ శాంతారాం.

Related Articles

Latest Articles