‘మా’ పోరు రెబల్ స్టార్ తీర్చగలరా!?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉంది. ఈ యేడాది మార్చి నాటికే ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి పూర్తయిపోయింది. అయితే కరోనాతో పాటు అక్కౌంట్స్ నూ ఓ కొలిక్కి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఆ మధ్య సర్వసభ్య సమావేశం పెట్టి ఇకపై ఎన్నికలను సెప్టెంబర్ లో జరపాలని తీర్మానం చేశారు. ఇది ఎంతవరకూ చెల్లుతుందనే విషయాన్ని పక్కన పెట్టితే…. సెప్టెంబర్ లో కూడా ‘మా’ ఎన్నికలు జరగకుండా, మరికొంత కాలానికి వాయిదా వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న ప్రకాశ్ రాజ్ లాంటి వారు ‘ ‘మా’ ఎన్నికలు ఎప్పుడు?’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. మరో పక్క రెండో ప్యానెల్ కు నేతృత్వం వహిస్తున్న మంచు విష్ణు ‘సినిమా పెద్దలంతా ఏకగ్రీవంగా ఓ ప్యానెల్ ను ప్రతిపాదిస్తే, తాను ఎన్నికల బరి నుండి తప్పుకుంటాన’ని తేల్చి చెప్పాడు. చిరంజీవి సోదరుడు నాగబాబు డైరెక్ట్ గా ప్రకాశ్ రాజ్ పక్షాన నిలబడితే, బాలకృష్ణ వంటి వారు ‘మా’ ఇంతవరకూ చేసిన కార్యక్రమాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ‘మా’ ఎన్నికలు సెప్టెంబర్ లోనైనా జరుగుతాయా లేక వాయిదా పడతాయా? అనే ఓ పెద్ద ప్రశ్న ఇప్పుడు అందరి ముందు ఉంది.

ఇదిలా ఉంటే… గత యేడాది ‘మా’ డైరీ ఆవిష్కరణ సమయంలో జరిగిన రచ్చ కారణంగా క్రమశిక్షణ మరియు సమన్వయ సంఘాన్ని కృష్ణంరాజు నేతృత్వంలో వేశారు. చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధ అందులో సభ్యులుగా ఉన్నారు. అయితే ఆ పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు ఆ మధ్య చిరంజీవి ప్రకటించారు. కానీ దాన్ని ఆమోదించినట్టు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ‘మా’ ప్రస్తుత కార్యవర్గం ఎన్నికల వ్యవహారాన్ని ఈ కమిటీకే అప్పగించినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ, సమన్వయ సంఘం ఛైర్మన్, రెబల్ స్టార్ కృష్ణంరాజునే అందరితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోమని కోరారట. ప్రకాశ్ రాజ్ ను సీనియర్ నటీమణి జయసుధ సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి గతంలో ఆమె, నరేశ్ ఇద్దరూ కూడా ఒకే ప్యానల్ నుండి పోటీ చేశారు. పైగా నరేశ్ కు ఆమె బంధువు కూడా. సో… ప్రకాశ్ రాజ్ కాకుండా ఆ ప్యానల్ కు చెందిన జయసుధను ‘మా’ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే తమకు అభ్యంతరం లేదని నరేశ్ వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ‘మా’ పీఠంపై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న ప్రకాశ్ రాజ్ ఇందుకు అంగీకరిస్తాడా అనే సందేహం లేకపోలేదు. గతంలో మురళీమోహన్ కోరిక మేరకు రాజేంద్ర ప్రసాద్ పై ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేసి జయసుధ ఓడిపోయారు. ఆ చేదు అనుభవం నుండి బయటకు వచ్చి ఆమె మరోసారి ‘మా’ కోసం పనిచేస్తారా? అనే ప్రశ్నకూడా కొందరు లేవనెత్తుతున్నారు. ఈసారి ‘మా’ ఎన్నికల బరిలో ఎవరు నిలిచినా… ముందుగా క్రమశిక్షణ, సమన్వయ సంఘం పెద్దలను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఎన్నికల గొడవే లేకుండా రెబర్ స్టార్ నేతృత్వంలో సినిమా పెద్దలు ఓసారి కూర్చుని, సామరస్యపూర్వకంగా చర్చించుకుని,, ‘మా’ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకోస్తారేమో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-