తెలంగాణలో రేపటి నుంచి కొత్త రూల్స్‌..

తెలంగాణలో లాక్‌డౌన్‌ నిబంధనలు మారనున్నాయి. మరో పదిరోజుల పాటు కొనసాగనున్న లాక్‌డౌన్‌.. సడలింపు సమయం పెరగనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు సమయం.. ఆ తర్వాత మరో గంట గ్రేస్‌ పీరియడ్‌గా ఉంది. రేపట్నుంచి ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఉండనుంది. ప్రజలంతా ఇళ్లకు చేరుకునేలా మరో గంట వెసులుబాటు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు.. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయనుంది ప్రభుత్వం. రాత్రి మొత్తం లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. కేబినెట్‌ ఆదేశాలతో.. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు సన్నద్ధమైంది పోలీసుశాఖ. అయితే, సడలింపు సమయం పెంపుతో ప్రజలతో పాటు, వ్యాపార వాణిజ్య వర్గాలు ఊపిరిపీల్చుకోనున్నాయి.

మరోవైపు.. కరోనా పూర్తిగా అదుపులోకి రాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాత లాక్‌డౌన్‌ రూల్సే అమలుకానున్నాయి. అక్కడ ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం రెండింటి వరకే సడలింపు ఉండనుంది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభం కాగా.. 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే వెసులుబాటు కల్పించారు. వెసులుబాటు సమయాన్ని మరో నాలుగు గంటలు పెంచుతూ.. రెండోసారి లాక్‌డౌన్‌ను మే 31 నుంచి జూన్‌ 9 వరకు పొడిగించారు. ఇప్పుడు మరోసారి సడలింపు సమయం పెంపుతో.. జూన్‌ 19 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-