చెరిగిపోని రామానాయుడు ముద్ర!

(జూన్ 6న డి.రామానాయుడు జయంతి)
“పుట్టినరోజు పండగే అందరికీ… మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ…” అనే పల్లవితో సాగే పాట ‘జీవనతరంగాలు’ చిత్రం కోసం డాక్టర్ సి.నారాయణ రెడ్డి కలం నుండి జాలువారి ఎందరినో అలరించింది. ఆ పాట రాయించుకున్న ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడుకు ఆ గీతం అన్ని విధాలా సరిపోలుతుంది. “తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి… తానున్నా లేకున్నా… తన పేరు నిలవాలి…” అంటూ అదే పాటలో తరువాతి పంక్తులు సాగుతాయి. అదే తీరున రామానాయుడు జీవితం సాగింది. 1964లో ‘సురేశ్ ప్రొడక్షన్స్’ సంస్థను నెలకొల్పినప్పుడు పదిమందికి మేలు చేస్తే చాలు అనుకున్నారు. సురేశ్ సంస్థ తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ విజయం సాధించగానే, వరుసగా చిత్రాలు నిర్మిస్తూ ముందుకు సాగారు రామానాయుడు. ఆయన ఉదారతను చూసి, ఎంతోమంది సురేశ్ సంస్థ నీడను చేరారు. తనను నమ్ముకున్న వారందరినీ ఆదుకోవాలన్నదే రామానాయుడు లక్ష్యంగా మారింది. అనూహ్య విజయాలను చూశారు. కొన్ని పరాజయాలూ పలకరించాయి. అయినా ఏ నాడూ చిత్రనిర్మాణాన్ని వీడలేదు. తమ సంస్థను ఆధారం చేసుకొని ఎన్నో కుటుంబాలు ఉన్నాయన్న ధ్యాసతోనే నాయుడు చిత్రనిర్మాణం సాగింది. తన కుటుంబం ఎంచక్కా కూర్చుని తిన్నా తరిగిపోని ఆస్తులు సంపాదించారు రామానాయుడు. ఆయన చిత్ర నిర్మాణాన్ని ఓ వ్యసనంగా చేసుకున్నారు. ప్రతిభ ఉంటే చాలు పట్టుకు వచ్చి పట్టం కట్టాలని చూసేవారు. అలా ఎందరో నాయుడు నీడలో ఒదిగి, చిత్రసీమలో ఎదిగారు. వారందరూ ఈ నాటికీ ‘మా నాయుడు గారు’ అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా గుర్తు చేసుకొనే సమయంలో వారి కళ్లలో ఓ వెలుగు కనిపిస్తుంది. దాని వెనకాల కనీకనిపించకుండా కన్నీటి పొరకూడా దాగి ఉంటుంది. రామానాయుడు వల్లే చిత్రసీమలో తాము ఉన్నామన్న ఆనందం వెలుగును చూపిస్తే, ఆయన లేరన్న సత్యాన్ని ఆ కన్నీటి పొర చాటుతుంది.

నాయుడు రికార్డ్!
శతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన రామానాయుడు చిత్రనిర్మాణంలో పలు ఆటుపోట్లు చూశారు. అయినా ఏ నాడూ చలించలేదు. ‘రాముడు-భీముడు’ ఆయనను నిర్మాతగా పరిచయం చేస్తే, ‘ప్రేమనగర్’ ఆయన సంస్థను నిలిపింది. ఆ తరువాత రామానాయుడు మరి వెనుదిరిగి చూసుకోలేదు. మాతృభాష తెలుగులోనే కాదు, హిందీ, తమిళ, కన్నడ, మళయాళ, మరాఠీ, భోజ్ పురి, పంజాబీ, బెంగాలీ భాషల్లో చిత్రాలు నిర్మించి అలరించారు. భారతీయ భాషలన్నిటా చిత్రాలు నిర్మించాలన్నదే ధ్యేయంగా సాగారు రామానాయుడు. ఒకటి, రెండు భాషల్లో నాయుడు చిత్రాలు నిర్మించలేకపోయారు. కానీ, ఆయనలా అన్ని భాషల్లో సినిమాలు తీసినవారు లేరు.

నాయుడు నీడలో ఎందరో…
రామానాయుడు చిత్రాల ద్వారా ఎందరో చిత్రసీమకు పరిచయమయ్యారు. వారిలో చాలామంది సినిమా రంగంలో తమదైన బాణీ పలికించారు. ‘పాపకోసం’తో జి.వి.ఆర్. శేషగిరిరావును, ‘ద్రోహి’తో కె.బాపయ్యను, ‘సావాసగాళ్ళు’తో బోయిన సుబ్బారావును దర్శకులుగా పరిచయం చేశారు. కొన్నిసార్లు వాళ్ళు తడబడినా ఇదిగో నేనున్నానంటూ చేయి అందించి, మరీ చిత్రసీమలో నిలబెట్టారు. బాపయ్య ‘ద్రోహి’ అంతగా ఆకట్టుకోలేకపోయినా, తరువాత ‘సోగ్గాడు’తో బంపర్ హిట్ ను అందించారు నాయుడు. ‘సంఘర్షణ’తో మంచి మార్కులు సంపాదించిన కె.మురళీ మోహనరావుకు ‘కథానాయకుడు’తో మరో ఛాన్స్ ఇస్తే, సూపర్ హిట్ కొట్టేశారు. ఇక బి.గోపాల్ కు తొలి చిత్రం ‘ప్రతిధ్వని’తోనే బిగ్ హిట్ పట్టేసేలా చేసిందీ నాయుడే! ప్రముఖ హస్యనటుడు నగేశ్ కు దర్శకత్వం చేయాలన్న తపన చూసి ఆయన డైరెక్షన్ లో ‘మొరటోడు’ చిత్రం నిర్మించారు. మరో హాస్యనటుడు ఏవీయస్ కూడా నాయుడు నిర్మించిన ‘సూపర్ హీరోస్’తోనే దర్శకుడయ్యారు. ‘రాము’తో వై.నాగేశ్వరరావు, ‘ప్రేమించుకుందాం …రా’తో జయంత్, ‘గణేశ్’తో తిరుపతి స్వామి, ‘ప్రేయసి రావే’తో చంద్రమహేశ్, ‘నువ్వు లేక నేను లేను’తో వై.కాశీవిశ్వనాథ్ ను దర్శకులుగా పరిచయం చేసిందీ రామానాయుడే! ఇ.వి.వి.సత్యనారాయణ తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’ అంతగా అలరించలేకపోయినా, ‘ప్రేమఖైదీ’తో ఆయనను దర్శకునిగా నిలబెట్టారు. ‘శివయ్య’తో సురేశ్ వర్మ హిట్టు కొట్టేలా చేసిందీ ఆయనే! ‘తాజ్ మహల్’తో ముప్పలనేని శివ, ‘జయం మనదేరా’తో ఎన్.శంకర్ కూడా రామానాయుడు సినిమాలతోనే అదిరిపోయే విజయాలు చూశారు. ఇలా ఎందరో దర్శకులు రామానాయుడు నీడకు చేరి విజయాలను చూసిన సందర్భాలున్నాయి.

తారలు సైతం…
నాయుడు చిత్రాలతో వెలుగు చూసిన నటీనటులూ ఉన్నారు. బాలనటునిగా రాణించిన హరీశ్ ‘ప్రేమఖైదీ’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక రణదీర్ కపూర్ పెద్ద కూతురు కరిష్మా కపూర్ ను తమ హిందీ ‘ప్రేమ్ ఖైదీ’తో నాయికగా పరిచయం చేశారు నాయుడు. ‘బొబ్బిలిరాజా’తో దివ్యభారతి నాయికగా పరిచయమయింది. ‘కూలీ నంబర్ వన్’తోనే టబు హీరోయిన్ అయింది. ఆ మాటకొస్తే తన తనయుడు వెంకటేశ్ ను హీరోగా పరిచయం చేసిందీ ఆయనే. ‘మల్లీశ్వరి’తో కత్రినా కైఫ్ తెలుగునాట అడుగు పెట్టింది. కె.బాపయ్య, కె.మురళీమోహనరావు వంటివారిని హిందీ చిత్రసీమకు పరిచయం చేసింది కూడా నాయుడు సినిమాలే. నాయుడు నిర్మించిన ‘ద్రోహి’తో జె.వి.రాఘవులు సంగీత దర్శకుడయ్యారు. అలాగే ‘సూపర్ హీరోస్’తో మణిశర్మ సంగీత దర్శకునిగా మారారు. చిత్రసీమకు రామానాయుడు చేసిన సేవలకు గాను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, కేంద్రం అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ లభించాయి.

పేరు నిలచే ఉంది…
చిత్రసీమలో తనదైన బాణీ పలికించిన నాయుడు, రాజకీయాల్లోనూ విజయాన్ని చవిచూశారు. బాపట్ల లోక్ సభ నియోజకవర్గం నుండి ఎం.పి.గా గెలుపొందిన రామానాయుడు తన నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నారు. అంతేకాదు, హైదరాబాద్ నగర సమీపంలో వృద్ధాశ్రమం నెలకొల్పి, ఎందరో వృద్ధులకు నీడనిచ్చారు. ఇలా తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి అన్న ధ్యేయంతో ముందుకు సాగిన రామానాయుడు నేడు భౌతికంగా మన మధ్య లేకున్నా, అందరి మనసుల్లో చోటు సంపాదించారు. ‘తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి’ అన్నట్టుగానే నాయుడు పేరు చిరస్థాయిగా నిలచే ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-