పెందుర్తిలో ల్యాండ్ రాజకీయాలు…!

ఆయనో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. రాజకీయాలకు పాతే అయినా వయసు, సీనియారిటీ తక్కువ. దీంతో సీనియర్ నేతలే అక్కడ చక్రం చక్రం తిప్పుతూ.. ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారట. ఇంకేముందీ హైకమాండ్‌ నుంచి ఎమ్మెల్యేకు ఒక్కటే అక్షింతలు. ఈ పంచాయితీనే ఆ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది.

పెందుర్తిలో ల్యాండ్‌ రాజకీయాలు ఎక్కువ..!

గ్రేటర్ విశాఖ పరిధిలో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం పెందుర్తి. ఇక్కడ ప్రభుత్వ, పోరంబోకు భూములు ఎక్కువ. సబ్బవరం ఎడ్యుకేషనల్ హబ్‌గా.. పరవాడ ఫార్మా, పరిశ్రమల కేంద్రంగా మారింది.16వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని అటు, ఇటు నగరం విస్తరణ జరుగుతోంది. దీంతో పెందుర్తి పరిధిలో భూములకు డిమాండ్ విపరీతంగా పెరిగి.. అక్రమాలు ఎక్కువయ్యాయి. రికార్డులు ట్యాంపరింగ్, భూ ఆక్రమణల ఫిర్యాదులు కామన్‌. రాజకీయాలు కూడా వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. అధికార, విపక్షాలకు భూముల భాగోతమే పెద్ద ఆయుధం.

ఎవరినీ ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఎమ్మెల్యే..!

టీడీపీ హయాంలో ముదపాక సహా పలు భూముల వివాదాలు రాజకీయాలను వేడెక్కించాయి. అప్పట్లో జరిగిన కేటాయింపులపై గట్టిపోరాటం చేసింది వైసీపీ. గత ఎన్నికల ప్రచారంలోనూ ఇదే కీలక అంశం. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అదీప్‌రాజు. రాజకీయాలకు కొత్త కాకపోయినా తొలిసారి అధికారంలోకి వచ్చారు. పెందుర్తిలో గవర, కాపు, వెలమ సామాజికవర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఈ కారణంగా ఎమ్మెల్యే ఎవరినీ ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు టాక్‌. ఇదే అదనుగా భావించిన పెందుర్తిలోని కొందరు నాయకులు ఇటీవల చేసిన పంచాయితీలు అదీప్‌రాజుకు ఇబ్బందిగా మారాయట.

ఒకటి రెండు వ్యవహారాల్లో ఎమ్మెల్యేకు తలంటిన హైకమాండ్‌..!
ప్రభుత్వ భూమి అని స్వయంగా బోర్డు పెట్టిన ఎమ్మెల్యే..!

విశాఖ చుట్టుపక్కల భూముల్లో తలదూరిస్తే ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారపార్టీ వారైనా, విపక్ష నాయకులైన ఒకటే ట్రీట్మెంట్‌. అందుకే భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఎమ్మెల్యే అదీప్‌రాజుకు చెమటలు పట్టిస్తున్నాయట. చిన్న ఆధారం దొరికినా ఎమ్మెల్యే వెంట పడుతోంది టీడీపీ. ఇక ఒకటి రెండు వ్యవహారాల్లో నేరుగా ఎమ్మెల్యేకు హైకమాండ్‌ తలంటేసిందనే ప్రచారం ఉంది. అయితే తన ప్రమేయం లేకుండా కొందరు పార్టీ నేతలు చేస్తున్న పనులు భరించలేకపోతున్నట్టు సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఎమ్మెల్యే. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న నియోజకవర్గ స్థాయి నాయకుడు తీరుపై తటపట్టుకుంటున్నారట. సువిశాల విస్తీర్ణంలో అమ్మకం కోసం విల్లాలను నిర్మించి.. ప్రభుత్వ భూమిలో నుంచి ఆయన రహదారి ఏర్పాటు చేసుకోవడంతో రచ్చ రచ్చ అవుతోంది. రోడ్డు వేయడానికి అనుమతి ఎవరిచ్చారని ఎమ్మెల్యే నిలదీస్తే అధికారులు సైలెంట్‌ అయ్యారట. అయితే సదరు నాయకుడు ఎమ్మెల్యే పేరును ఇక్కడ వాడేసినట్టు సమాచారం. దీంతో స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి రోడ్డు నిర్మించిన చోట ఇది సర్కార్‌వారి స్థలం.. అతిక్రమిస్తే శిక్ష తప్పదు అని బోర్డు పెట్టాల్సి వచ్చింది.

పరిష్కారం కోసం పార్టీ పెద్దల దగ్గరకు ఎమ్మెల్యే..!
ఎమ్మెల్యేను కార్నర్‌ చేసేందుకు పార్టీ నేతలు సిద్ధం..!

ఇదొక్కటే కాదు పెందుర్తి పరిధిలో చాలా వ్యవహారాలు అదీప్ రాజ్ నోటీసుకు వచ్చే సరికే ముదురు పాకాన పడుతున్నాయట. వాటిని సమర్ధించలేక.. పార్టీ నాయకత్వం తలంటు భరించలేక ఎమ్మెల్యే నలిగిపోతున్నట్టు వినికిడి. సామాజికవర్గం ఓట్లను చూపించి కొందరు నేతలు తన రాజకీయ భవిష్యత్‌ను ఇరకాటంలో పడేస్తున్నారనే భావనలో ఉన్నారట అదీప్‌రాజు. దీంతో పెందుర్తిలోని పరిస్ధితులను వైసీపీ పెద్దలకు వివరించి.. పరిష్కారం చూపించాలని కోరబోతున్నట్టు సమాచారం.
పనిలో పనిగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్టీలోని సదరు సీనియర్లంతా కినుక వహించినట్టు సమాచారం. ఎమ్మెల్యేను కార్నర్ చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయనే ప్రచారం ఉంది. దీంతో అలెర్ట్ అయిన అదీప్ రాజ్ పార్టీలో కీలక నేతల సహాయంతో సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారట. అవసరమైతే కొందరు నాయకులను పక్కన పెట్టైనా ముందుకెళ్లకపోతే రాజకీయంగా కష్టమనే భావన అదీప్‌రాజులో ఉందని సమాచారం. మరి.. ఈ సమస్యను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.

Related Articles

Latest Articles