30 ఏళ్ళ ‘లమ్హే’

ఒకే రోజున విడుదలైన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజయ్ దేవగణ్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ విడుదలైన రోజునే శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన రొమాంటిక్ మూవీ ‘లమ్హే’ విడుదలయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 1991 నవంబర్ 22న విడుదలైన ‘లమ్హే’ నటిగా శ్రీదేవికి ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. యశ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కూడా భాగస్వామి కావడం విశేషం.

తల్లిని ప్రేమించిన వ్యక్తి, ఆమె కూతురును వివాహం చేసుకోవడం ‘లమ్హే’లోని ప్రధానాంశం. తన తండ్రి స్నేహితుడి కూతురయిన పల్లవిని ప్రేమిస్తాడు వీరేన్. కానీ, ఆమె వయసులో అతని కంటే చాలా పెద్దది అని తెలుస్తుంది. అయినా ప్రేమిస్తాడు. కానీ, ఆమె మరొకరిని ప్రేమిస్తోందని తెలిసి గుండె పగిలిపోతుంది. పల్లవి ప్రేమించిన వ్యక్తినే మనువాడుతుంది. ఓ బిడ్డను ప్రసవించి కన్నుమూస్తుంది. వీరేన్ ప్రతి సంవత్సరం లండన్ నుండి పల్లవి వర్ధంతికి హాజరవుతూ ఉంటాడు. పల్లవి కూతురు పూజ బర్త్ డే కూడా అదే రోజు కావడంతో అతను ఎక్కువగా పట్టించుకోడు. కానీ, పూజ పెరిగి పెద్దదయిన తరువాత అచ్చు గుద్దినట్టు తల్లి పోలికలతో ఉంటుంది. పల్లవిని ఊహించుకొని ఓ బొమ్మ గీసి ఉంటాడు వీరేన్. అది తనను దృష్టిలో ఉంచుకొని గీసిందేనని పూజ భావిస్తుంది. వీరేన్ పై మనసు పారేసుకుంటుంది. అతను తన కంటే వయసులో ఎంతో పెద్దవాడయినా, అతణ్ణే పెళ్ళాడతానంటుంది. అందుకు వీరేన్ అంగీకరించడు. చివరకు పూజ ప్రేమలోని బలాన్ని తెలుసుకున్న వీరేన్ కూడా ఆమెను కోరుకోవడం, వారి పెళ్ళి జరగడంతో కథ ముగుస్తుంది.

ఈ కథను యశ్ చోప్రా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. యశ్ చోప్రా తనదైన మార్కు సీన్స్ తో రక్తికట్టించడమే కాదు, మ్యూజికల్ హిట్ గానూ చిత్రాన్ని తీర్చిదిద్దారు. పల్లవిగా, పూజగా శ్రీదేవి అభినయం ఆకట్టుకుంది. వీరేన్ గా అనిల్ కపూర్ నటించారు. వహిదా రెహమాన్, అనుపమ్ ఖేర్, దిప్పీ సాగూ, మనోహర్ సింగ్, లలిత్ పవార్, దీపక్ మల్హోత్రా, ఇలా అరుణ్, వికాస్ ఆనంద్ ఇతర పాత్రధారులు. ‘నువ్వేకావాలి’లో నాయికగా నటించిన రిచా పల్లాడ్, ఇందులో చిన్నారి పూజగా నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత విద్వాంసులు శివ్ కుమార్ శర్మ, హరి ప్రసాద్ చౌరసియా ‘శివ్-హరి’ పేరుతో సంగీతం సమకూర్చారు. ఆనంద్ బక్షి పాటలు రాశారు.

‘లమ్హే’లోని “యే లమ్హే యే పల్…”, “మారే రాజస్థాన్ మా…”, “మోహే ఛోడే నా…”, “ఛుడియా ఖనక్ గయీ…”, “కభీ మై కహూ…”, “మేఘా రే మేఘా రే…”, “యాద్ నహీ బూల్ గయా…”, “మేరీ బిందియా…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ద్వారా బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్ గా నీతా లుల్లా, కచిన్స్, లీనా దారూ నేషనల్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఫిలిమ్ గా ఈ చిత్రం ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకుంది. దీంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా శ్రీదేవి, బెస్ట్ కమెడియన్ గా అనుపమ్ ఖేర్, బెస్ట్ స్టోరీ రైటర్ గా హనీ ఇరానీ, బెస్ట్ డైలాగ్ రైటర్ గా రాహి మాసూమ్ రెజా కూడా ఫిలిమ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. ‘లమ్హే’ నిర్మాతలకు మంచి లాభాలు చూపింది. ఇప్పటికీ ‘బెస్ట్ రొమాంటిక్ మూవీస్’ జాబితాలో ‘లమ్హే’ తొలి పదిస్థానాల్లోనే చోటు సంపాదిస్తూ ఉండడం విశేషం!

Related Articles

Latest Articles