రివ్యూ: లాభం (తమిళ డబ్బింగ్)

అభిమానులు ప్రేమగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుచుకునే తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి గతంలోనే తెలుగులో ‘సైరా’లో ఓ ప్రత్యేక పాత్రలో మెరిశాడు. ఈ యేడాది వచ్చిన ‘ఉప్పెన’లో ప్రతినాయకుడిగా నటించి, మెప్పించాడు. తాజాగా విజయ్ సేతుపతి నటించిన ‘లాభం’ తమిళ చిత్రం, తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయ్యి ఒకేసారి విడుదలైంది. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషించిన ‘లాభం’ ఎలా ఉందో తెలుసుకుందాం.

దేశ దిమ్మరి మాదిరి ఊర్లు పట్టి తిరిగిన బద్రి (విజయ్ సేతుపతి) కొన్నేళ్ళ తర్వాత తన గ్రామం పండూరుకు వస్తాడు. విశ్వాసానికి ఆధారం వ్యవసాయం అని నమ్మిన అతను వూరిలోకి అడుగుపెట్టినప్పుడే అక్కడి రైతు సంఘం ఎన్నికలు జరుగుతుంటాయి. ఊరిలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న మోతుబరి రైతు, పారిశ్రామిక వేత్త నాగభూషణం (జగపతిబాబు) బృందం ఆ ఎన్నికల్లో నిలబడాలని అనుకుంటుంది. అయితే… బద్రి పునరాగమనంతో వాళ్ళంతా తోక ముడిచి, అతని ప్యానల్ కే మద్దత్తు ప్రకటిస్తారు. దాంతో కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికైన బద్రి… ఉమ్మడి వ్యవసాయం చేయడానికి గ్రామస్థులను ఒప్పిస్తాడు. అలా చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని రైతు సంఘం కార్యాలయంలోని లాకర్ లో భద్రపరుస్తాడు. మర్నాడు రైతులకు ఆ మొత్తం డబ్బును పంచాల్సి ఉండగా, లాకర్ మాయమవుతుంది. దాని వెనుక సూత్రధారి బద్రి అతని స్నేహితులే అని నాగభూషణం గ్రామస్థులను నమ్మిస్తాడు. తన మీద పడ్డ మచ్చను బద్రి ఎలా తుడిచేసున్నాడు? కొడుకు పెట్టబోయే బయో డీజిల్ ఫ్యాక్టరీ కోసం కుట్రలు పన్ని, రైతులను మోసం చేసిన నాగభూషణంకు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే మిగతా కథ.

విజయ్ సేతుపతి నటించే సినిమాలలో ఏదో ఒక కొత్త అంశం ఉంటుందన్నది అతని అభిమానులందరి నమ్మకం. ఆ రకంగా చూస్తే… ‘లాభం’ అదే తరహా చిత్రం. అంతేకాదు… రైతుల సమస్యను, పారిశ్రామిక వేత్తల దోపిడిని కూడా తెలిపే సినిమా ఇది. గ్రామాలలోని రైతులు సంఘటితమై రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోకపోతే, దోపిడికి గురి కాకతప్పదని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఎస్. పి. జననాథన్ తెలిపే ప్రయత్నం చేశారు. కారల్ మార్క్స్ ప్రవచించిన ‘లాభం’ అనే అంశం గురించి సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ కథానాయకుడు చెబుతూనే ఉంటాడు. రైతులు శ్రమదోపిడికి ఎలా గురి అవుతున్నారో ఉదాహరణలతో సహా వివరిస్తాడు. అంతేకాదు… రైతులు తాము పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను తామే నిర్ణయించుకోవాలని భావిస్తాడు. ఆ రకంగా చూసినప్పుడు ఇది రైతులను, రైతు సంఘాలను బలపరిచే చిత్రం. అలానే అభివృద్ధి పేరుతో పారిశ్రామిక వేత్తలు చేస్తున్న దారుణాలను ఎండగట్టే చిత్రం. అయితే… దర్శకుడు ఎంచుకున్న కథ మంచిదే అయినా… దానిని తెర మీద చూపించే విషయంలో విఫలమయ్యాడు. హీరోకు కమ్యూనిస్టు భావజాలాన్ని ఆపాదించడం, కారల్ మార్క్స్ ఐడియాలజీ గురించి అతను అందరికీ వివరించడం చూస్తే… ఇది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల కోసం తీసిన సినిమానా? అనే సందేహం కలగక మానదు. రైతుల సమస్యలకు కమ్యూనిజమే పరిష్కారం అన్నట్టుగా దర్శకుడు చూపించాడు. ఉమ్మడి వ్యవసాయం అనే కాన్సెప్ట్ మన దేశంలో విఫలమైందని ఓ పక్క అంగీకరిస్తూనే, అదే పనిని హీరో చేత బలవంతంగా చేయించి, విజయం సాధించినట్టు చూపించారు. హీరో, అతని గతం అంతా సినిమాటిక్ గా ఉంది తప్పితే ఎక్కడా కన్వెన్సింగ్ గా లేదు. అలానే హీరో, అతని బృందం లాకర్ ను దొంగిలించారని నాగభూషణం చేసే ఆరోపణ, అందుకు చూపించే సాక్ష్యం కూడా హాస్యాస్పదంగానే ఉంది. ఇక హీరో గతాన్ని ద్వితీయార్థంలో చూపించడం సినిమాను సాగదీయడం తప్పితే దాని వల్ల ఒరిగింది కూడా ఏమీలేదు.

ఎప్పుడో మొదలు పెట్టి, చివరకు ఎలాగో పూర్తి చేసి ఈ సినిమాను విడుదల చేసినట్టుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలూ శూన్యం. డబ్బింగ్ విషయంలోనూ నిర్మాతలు రాజీ పడినట్టు తెలిసిపోతోంది. ఏ ఒక్క సైన్ బోర్డ్ నూ తెలుగులో చూపించే ప్రయత్నం చేయలేదు. అసలు హీరో ఎంట్రీనే ఏదో బుడబుక్కల వాడు ఊరికి వచ్చినట్టుగా ఉంది. అది సరిపోదన్నట్టుగా సినిమా క్లయిమాక్స్ లో అతనితో మరో పగటి వేషగాడి వేషమూ వేయించాడు దర్శకుడు. ఇక హీరోకు, హీరోయిన్ కు మధ్య అసలు అనుబంధమే ఉండదు. ఆ పాత్ర కోసం శ్రుతి హాసన్ ను ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ప్లే చేసే పాత్ర కాబట్టి శ్రుతి అంగీకరించిందేమో తెలియదు! చిత్రం ఏమంటే… విజయ్ సేతుపతి ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరు. అతనిది కూడా కమ్యూనిస్టు పార్టీ ఐడియాలజీనే అయి ఉంటుంది. లేకపోతే ఇలాంటి సినిమాను ఆయన నిర్మించే ఆస్కారమే లేదు.

నటుడిగా విజయ్ సేతుపతికి వంక పెట్టడానికి లేదు. కానీ ఇందులోని బద్రీ పాత్రకు ఎందుకో అంత ఫిట్ కాలేకపోయాడు. శ్రుతి హాసన్ పోషించిన క్లారా కూడా ఓ అతిథి పాత్రనే తలపిస్తుంది, ఏదో ఇలా వచ్చి, అలా నటించి వెళ్ళిపోయినట్టు. ఇక విలన్ గా నటించిన జగపతిబాబుకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం ఎంత మాత్రం బాలేదు. ఆయనను వేరే వారి గొంతులో చూడలేకపోయాం. జగపతిబాబు పీఏ పాత్రను సాయి ధన్సికతో చేయించాల్సింది కాదు. ఆర్టిస్టులంతా ఏదో ఆబ్లికేషన్ తో నటించిన భావన సినిమా చూస్తుంటే కలుగుతుంది. డి. ఇమ్మాన్ సంగీతం, రామ్ జీ సినిమాటోగ్రఫీ పెద్దంత గొప్పగా ఏమీ లేవు. దర్శకుడు ఎస్.పి. జననాథన్ గత యేడాది ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. బహుశా దాంతో ఈ చిత్రం ఓ అనాథ అయిపోయిందేమో తెలియదు. ఏదేమైనా… ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే కార్యకర్తలు, కమ్యూనిస్టులకు మాత్రమే నచ్చే సినిమా ఇది. విజయ్ సేతుపతి అభిమానులు ‘లాభం’ చూసి నిరాశ పడాల్సిందేమీ లేదు. అతను తాప్సీతో కలిసి నటించిన ‘అనబెల్ సేతుపతి’ చిత్రం ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ హారర్ కామెడీ సినిమా ఆయన ఫ్యాన్స్ ను అలరిస్తుందేమో చూద్దాం.

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్
ఎంపిక చేసుకున్న కథ
జగపతిబాబు నటన

మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
నిర్మాణ విలువలు లేకపోవడం

ట్యాగ్ లైన్: ‘లాభం’ లేదు!

SUMMARY

Laabam movie review in Telugu

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-