10 రూపాయల కోడి పిల్లకి.. రూ.50 టికెట్.. ఎక్కడంటే?

పావలా కోడికి..ముప్పావలా మసాలా అనేది పాత సామెత. ఇప్పుడు కాస్త మార్చుకోవాలేమో.. 10 రూపాయల కోడిపిల్లకు 50 రూపాయల టికెట్. ఇది కర్నాటక ఆర్టీసీ వారి లీల. బస్సులో మనతో పాటు లగేజీ తీసుకువెళితే.. లగేజ్ టికెట్ కూడా వసూలు చేస్తాడు కండక్టర్. ఆ లగేజ్ టికెట్ ప్రయాణికుల టికెట్ తో సమానంగా వుండదు. కానీ కేఎస్ఆర్టీసీ వారి తీరే వేరు. సంచిలో కోడిపిల్లను తీసుకువెళితే కూడా టికెట్ తీసుకోవాలన్నాడా కండక్టర్. అది కూడా తక్కువేం కాదు.ఏకంగా 50 రూపాయల టికెట్ ఇచ్చాడు, దీంతో అవాక్కవ్వడం ఆ కుటుంబం వంతయింది.

కర్నాటకలో ఉత్తర కన్నడ జిల్లా సిద్ధపుర నుంచి ఓ బస్సులో ప్రయాణిస్తోంది ఓ కుటుంబం. తమతోపాటు కోడిపిల్లను తీసుకువెళ్లింది. రూ.10కి కోడి పిల్లను కొనుగోలు చేసి సంచిలో పెట్టుకున్నారు. హోసనగర నుంచి షిరూరుకు ఆర్టీసీ బస్సులో పయనమయ్యారు. హోసనగర వద్ద బస్సు ఎక్కిన వారు.. మూడు టికెట్లు కావాలని కండక్టర్​ను అడిగారు.

అదే టైంలో సంచిలోంచి కోడి పిల్ల కిచ్ కిచ్ అని సౌండ్ చేసింది. కోడిపిల్లని బస్సు కండక్టర్ గమనించాడు. కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలన్నాడు. దీంతో చేసేదేం లేక సరే అన్నారు. దానికి హాఫ్ టికెట్ తీసుకుంది ఆ కుటుంబం. రూ.10కి కోడి పిల్లను కొనుగోలు చేయగా.. రూ.50 పెట్టి దానికి టికెట్​తీసుకోవడం విశేషం. కోడిపిల్ల టికెట్ తో కలిసి వారికి మొత్తం రూ.353 అయింది. ఈ వ్యవహారాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది వైరల్ గా మారింది.దీంతో కర్నాటక ఆర్టీసీ తీరుపై కామెంట్లు పడుతున్నాయి.

Related Articles

Latest Articles