రాజకీయాల్లో ‘కొండా’ సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు దూకుడుగా రాజకీయాలు చేస్తుంటే.. మరికొందరు నెమ్మదిగా వెళుతుంటారు. ఏదిఏమైనా అల్టిమేట్ గా వాళ్ల గోల్ మాత్రం అందలం ఎక్కి ప్రజాసేవ చేయడమే. సరైన వ్యూహాలతో ముందుకెళితే రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ ఉంటుంది. లేనట్లయితే అనతికాలంలోనే కనుమరుగు కావాల్సి ఉంటుంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు మారాలంటే చాలా ఆలోచించే వాళ్లు. ఇప్పుడైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి జంపింగ్ లు కామన్ అయిపోయింది. దీన్ని ప్రజలు లైట్ తీసుకోవడంతో ఇటీవల కాలంలో ఇలాంటి ఎక్కువగా కన్పిస్తున్నాయి.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. కానీ అన్ని పార్టీలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలతో మంచి స్నేహబంధాలను కొనసాగిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఏదైతే ప్రత్యామ్నాయంగా మారుతుందో ఆపార్టీలో చేరేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీ కండువా కప్పుకోలేదని అర్థమవుతోంది. ప్రజల మూడ్ ను బట్టి ఆయన ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రత్యేక రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ లో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆయన ఆపార్టీని వీడి బయటికి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆపార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన చూపు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

ఇలాంటి సమయంలోనే రేవంత్ రెడ్డికి టీపీసీ చీఫ్ పదవి దక్కింది. రేవంత్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఒకరు. రేవంత్ పీసీసీ కావాలని తొలి నుంచి కోరుకున్న నేతల్లో ఈయన కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. మరోవైపు బీజేపీ నేతలతోనూ అంతే సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతానేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

ఇటీవల రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సైతం ఆయన వైట్ ఛాలెంజ్ ను విసిరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి ఛాలెంజ్ స్వీకరించారు. ఆయన తన ఛాలెంజ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కు ఛాలెంజ్ గా విసిరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఛాలెంజ్ ను బండి సంజయ్ స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన అన్ని పార్టీల నేతలతో సఖ్యతగా ఉన్నట్లు అర్థమవుతోంది.

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ అయితే ఎదుగుతుందో ఆ పార్టీలో చేరేందుకే సిద్ధమనే సంకేతాలను పంపుతున్నారు. అందుకే ఆయన కండువా కప్పుకునేందుకు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కన్పిస్తుంది. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ఎన్నికల నాటికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఆయన ఏ పార్టీలో చేరే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతుండటం గమనార్హం.

-Advertisement-రాజకీయాల్లో ‘కొండా’ సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Related Articles

Latest Articles