హుజూరాబాద్ పై కొండా మెలిక.. సూపరో సూపర్…!

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ కుటుంబం.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత పొందింది. తర్వాత టీఆర్ఎస్ లోకి రావడం.. చివరికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరడం.. ఇలా ఐదారేళ్లుగా వారి రాజకీయం చుక్కాని లేని నావలా ముందుకు పోతోంది. ఇలాంటి తరుణంలో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో వారిని ఓ అవకాశం తలుపు తట్టి మరీ పిలుస్తోంది. ఈ విషయమై.. కొండా సురేఖ కుటుంబం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

గతంలో జరిగిన పొరబాట్లు, రాజకీయంగా చేసిన తప్పులు మళ్లీ చేయకూడదు అని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ.. హుజూరాబాద్ విషయంలో కొండా సురేఖ కుటుంబం పెట్టిన మెలిక.. వారి అనుచరులతో అదుర్స్ అనిపిస్తోంది. ఈటల రాజేందర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలపై.. బలమైన అభ్యర్థిని పెట్టాలని చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వాన్ని.. ఈ మెలిక ఆలోచనలో పడేసింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు కొండా సురేఖ కాస్త సుముఖంగానే ఉన్నారు. కానీ.. అంటూ ఓ విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ ను తర్వాత రాబోయే ఎన్నికల్లో తన కుటుంబానికే కేటాయిస్తానని చెబితేనే.. ఆ మేరకు స్పష్టమైన హామీ వస్తేనే.. తాను హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని అంటున్నారట. ఈ విషయమై.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నదే.. చర్చనీయాంశమైంది.

మరోవైపు.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో వద్దిరాజు రవిచంద్ర అనే నాయకుడు పోటీ చేసినా.. ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఇదే అవకాశంగా భావిస్తున్న కొండా సురేఖ కుటుంబం.. ఆ స్థానాన్ని తన కుటుంబానికి దక్కించుకునేందుకు ముందస్తుగానే కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. ఆమె అలా కోరడంలోనూ న్యాయముందని.. కొండా అనుచరులు అభిప్రాయపడుతున్నారు.

మరి.. కొండా సురేఖ కోరినట్టుగా.. వరంగల్ ఈస్ట్.. భవిష్యత్తులో వారికే దక్కుతుందా? హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేఖ నిలబడబోతున్నారా? చూద్దాం.

Related Articles

Latest Articles

-Advertisement-