కోడెల శివరాం పరిస్థితి ఇక అంతేనా..!

రాజకీయాల్లో తండ్రి ఓ వెలుగు వెలిగితే.. తనయుల పొలిటికల్‌ భవిష్యత్‌కు ఢోకా ఉండదు. కానీ.. ఆ వారసుడికి మాత్రం సీన్‌ రివర్స్‌. వారసుడి గత చరిత్రను ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది పార్టీ కేడర్‌. నేను మారిపోయాను బాబోయ్‌ అని.. ఆయన నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా విశ్వసించడం లేదట. దాంతో ఆయనకు పార్టీ ఛాన్స్‌ ఇస్తుందో లేదో అని చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరాయన?

సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌ పదవి కోసం కోడెల శివరామ్‌ యత్నం!

కోడెల శివరామ్‌. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు. గుంటూరు జిల్లాలో టీడీపీ లేదా నరసరావుపేట గురించి చెబితే కోడెల శివప్రసాదరావు ప్రస్తావన లేకుండా చర్చ ఉండదు. చనిపోయే వరకు రెండు దశాబ్దాలపాటు కోడెల బలమైన నేతగా కొనసాగారు. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచి స్పీకర్‌ అయ్యారు. ఆ సమయంలో కోడెల కుమారుడు శివరామ్‌తోపాటు.. ఆయన కుటుంబంపై అనేక ఆరోపణలు వచ్చాయి. 2019లో కోడెల ఓటమికి ఆ ఆరోపణలే కారణమని పార్టీ వర్గాలు ఇప్పటికీ చెప్పుకొంటాయి. శివప్రసాదరావు మరణం తర్వాత కోడెల శివరామ్‌ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌ పదవి కోసం శివరామ్‌ ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీ వర్గాల్లో ఆయన చర్చగా మారారు.

శివరామ్‌ లైన్‌లోకి రావడంతో కేడర్‌ అలర్ట్‌!

కోడెల మరణం తర్వాత శివరామ్‌ను సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా చేద్దామని చంద్రబాబు అనుకున్నారట. ఆ విషయం తెలుసుకుని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు దగ్గరకు వెళ్లి వద్దని వారించారట. దాంతో ప్రకటన వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు పేర్లు ఇంఛార్జ్‌ పదవికోసం ప్రచారంలోకి వచ్చినా.. ఎవరినీ ప్రకటించలేదు. ఇప్పుడు.. శివరామ్‌ మళ్లీ లైన్‌లోకి రావడంతో కదలిక మొదలైంది. చర్చ కూడా స్టార్ట్‌ అయింది.

ఐదేళ్లు దగ్గరగా చూసిన వాళ్లు శివరామ్‌ మాటలు నమ్మడం లేదా?
మారిపోయానని శివరామ్‌ చెప్పినా నమ్మడం లేదా?

ఇటీవల సత్తెనపల్లిలో తరచూ పర్యటిస్తున్నారు శివరామ్‌. టీడీపీ కార్యకర్తలతో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే శివరామ్‌ను ఐదేళ్లపాటు దగ్గరగా చూసిన కార్యకర్తలు.. స్థానిక నేతలు ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదట. కానీ తనను నమ్మేవాళ్లు తన వెంట రావొచ్చని చెబుతున్నారట. సత్తెనపల్లి టీడీపీలో మెజారిటీ నేతలు, కార్యకర్తలు శివరాం పేరు చెబితనే ఇప్పటికే భయపడుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీరును ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్టు సమాచారం. అయితే తాను మారిపోయానని.. తనను ఆ దృష్టితో చూడొద్దని శివరామ్‌ చెబుతున్నా.. విశ్వసించడం లేదట.

ఒక్క ఛాన్స్‌ కోసం అచ్చెన్నను కోరిన శివరామ్‌?

కేడర్‌ ఆలోచన ఎలా ఉన్నా.. సత్తెనపల్లిలో టీడీపీ కార్యక్రమాల జోరు పెంచారట శివరామ్‌. మొన్నటి వరకూ ఒక లెక్క… ఇప్పుటి నుంచి మరో లెక్క అని నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా పెద్దగా స్పందన రావడం లేదట. ఒకప్పుడు నియోజకవర్గంలో ఎదురులేని ఆయనకు ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతిని చూసి జీర్ణించుకోలేక పోతున్నట్టు సమాచారం. ఒక్కఛాన్స్ ఇవ్వాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కలిసి కోరినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగబోవని.. అధినేతను కలిసి చెప్పేందుకు సిద్ధమయ్యారట.

శివరామ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదా?

అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్క చేయకుండా.. అంతా తన కనుసన్నల్లో జరగాలని ఆదేశాలిచ్చిన కోడెల శివరామ్‌కు .. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదట. కానీ.. ప్రయత్నాలు ఆపడం లేదు. మరి.. ఆయన కోరుతున్నట్టు పార్టీ ఒక్క ఛాన్స్‌ ఇస్తుందో లేదో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-