‘ఇద్దరు మిత్రులు’ ప్రత్యర్థులుగా మారుతారా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. ఇది మరోసారి అక్షరాల నిజం కాబోతుంది. వారిద్దరి మధ్య కొన్ని దశాబ్ధాల స్నేహం ఉంది. ఏ పార్టీలో ఉన్న వారి మధ్య బంధం చెక్కు చెదరకుండా కొనసాగుతూ వస్తోంది. ఒకరి గెలుపును మరొకరు సెలబ్రెట్ చేసుకుంటూ ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు ప్రత్యక్ష ఫైట్ జరుగలేదు. కానీ అన్నిరోజులు ఒకలా ఉండవు కాదా? ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లే కన్పిస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇద్దరు మిత్రులు కాస్తా ప్రత్యర్థులుగా దిగబోతున్నారు. దీంతో వీరిద్దరిలో గెలుపు ఎవరిదీ అనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆ నేతలిద్దరు ప్రత్యక్ష ఫైట్ గా దిగుతుండటంతో గుడివాడలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత వంగవీటి రాధా పోటీ చేసేందుకు సై అంటున్నారట. దీంతో వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికలకు ముందు వీరిద్దరు వైసీపీలోనే ఉన్నారు. కొడాలి నాని ఎప్పటిలాగే గుడివాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా రాధా మాత్రం గత ఎన్నికల ముందు వైసీపీకి చివరి నిమిషంలో హ్యండిచ్చి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘెరపరాజయం చవిచూసింది. దీంతో వంగవీటి రాధా సైలంటయ్యారు. రాధా టీడీపీలో చేరినా మంత్రి కొడాలి నానితో స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. గత కొన్నిరోజులుగా రాధా తిరిగి వైసీపీ గూటికే చేరుతారని ప్రచారం జరిగింది. మంత్రి కొడాలి నాని ఇందుకు రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ గుడివాడ నుంచి రాధా టీడీపీ తరుఫున పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో మట్టికరిపిస్తానని ఆయన తన సన్నహితుల వద్ద చెప్పారట. దీంతో వీరిద్దరి మధ్య ప్రత్యక్ష ఫైట్ తప్పదనే ప్రచారం జోరందుకుంది.

కృష్ణా జిల్లాలోని గుడివాడ కొడాలి నానికి కంచుకోట. ఆయన టీడీపీలో ఉన్నా వైసీపీలో ఉన్నా ఇక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కిందటి ఎన్నికల్లో కొడాలి నానిపై టీడీపీ నుంచి దేవినేని అవినాష్ ను రంగంలోకి దింపి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దారుణంగా ఓడారు. ప్రత్యర్థులపై మాటలు తూటాలు పేల్చడంలో నానికి పోటీలేదని చెప్పాలి. దీంతో ఆయనపై పోటీ చేసేందుకు టీడీపీ నేతలు జంకుతుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పక్కలో బళ్లెంలా కొడాలి నాని మారాడు. దీంతోనే ఆయన్ను ఓడించేందుకు టీడీపీ అన్నివిధాలా సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై వంగవీటి రాధాను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.

గుడివాడలోని కాపు సామాజికవర్గంతో వంగవీటి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. రాధా సైతం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సై అంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా చాలా ఎదురుదెబ్బలు తిన్న రాధా ఇకపై తన నుంచి పరిణితి చెందిన రాజకీయాలు చూస్తారని సన్నిహితులతో అంటున్నారట. వంగవీటి రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా రాజకీయాల్లో ముందుకెళుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. గుడివాడలో ముందుగానే ప్రత్యర్థులు ఎవరో తెలిసిపోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ ఇద్దరు మిత్రులు ప్రత్యర్థులుగా బరిలో దిగితే అదృష్ట లక్ష్మి ఎవరు వైపు ఉంటుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

-Advertisement-‘ఇద్దరు మిత్రులు’ ప్రత్యర్థులుగా మారుతారా?

Related Articles

Latest Articles