ఒక దర్శకుడు, ఇద్దరు హీరోలు, రెండు సినిమాలు… ఓ కియారా!

తన ఒకే ఒక్క చిత్రంలో ప్రపంచంలోని ఏడు వింతలు చూపించి… వెండితెర మీద ఎనిమిదో వింతని ఆవిష్కరించాడు దర్శకుడు శంకర్. ‘జీన్స్’ లాంటి రొమాంటిక్ చిత్రం మొదలు ‘భారతీయుడు’ లాంటి సందేశాత్మక చిత్రం, ‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రం దాకా… ఆయన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అద్భుతమే! అయితే, గత కొంత కాలంగా శంకర్ టైం బ్యాడ్ మోడ్ లో నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆయన చిత్రాలు తన స్థాయికి తగ్గట్టుగా సెన్సేషన్ సృష్టించటం లేదు. మరో వైపు, ‘ఇండియన్ 2’ లాంటి సినిమాలు మధ్యలో ఆగిపోయి వివాదాలకు కూడా కారణం అవుతున్నాయి. అయితే, శంకర్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. కొత్త సినిమాల్ని ప్రకటిస్తూ ముందుకు పోతున్నాడు…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ సినిమా సంగతి మనకు తెలిసిందే. ‘ఆర్ సీ 15’గా ప్రచారం అవుతోన్న క్రేజీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో ‘ఎవడు’ స్టార్ ని ‘ఒకే ఒక్కడు’ డైరెక్టర్ కెమెరా ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే, ఈ మధ్యలోనే ఆయన మరో సినిమా ప్రకటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ‘అపరిచిత్’ తీస్తానంటూ శంకర్ చెప్పేశాడు. అయితే, దీనిపై అప్పుడే వివాదం నెలకొంది. ‘అపరిచితుడు’ చిత్రా నిర్మాత శంకర్ బాలీవుడ్ రీమేక్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు. ఆ గొడవ ఎలా ఉన్నా సౌత్ ఇండియాస్ టాప్ డైరెక్టర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. తన నెక్ట్స్ టూ ప్రాజెక్ట్స్ కి ఒకే హీరోయిన్ ని శంకర్ ఎంచుకున్నాడట! ఆమే… కియారా అద్వాణీ!
ఇటు తెలుగులో , అటు హిందీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ బ్యూటీ కియారా ఒకేసారి టూ ఫిల్మ్ డీల్ శంకర్ తో సెట్ చేసుకుందని ప్రచారం సాగుతోంది. రామ్ చరణ్ సినిమాలో ఆమె కథానాయిక అని కొన్నాళ్లుగా పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటుండగా ఇప్పుడు రణవీర్, శంకర్ మూవీలోనూ ఆమే ఫీమేల్ లీడ్ అంటున్నారు. అయితే, ‘అపరిచితుడు’ బాలీవుడ్ రీమేక్ వర్షన్ ‘అపరిచిత్’లో కియారా ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ‘ఆర్ సీ 15’లో మాత్రం మన ‘వినయ విధేయ రాముడి’తో మరోసారి కియారా రొమాన్స్ చేస్తుందని గట్టిగా చెబుతున్నారు. జూలై 31న ఆమె పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ వెలువడవచ్చని బాలీవుడ్ టాక్!
శంకర్, కియారా టూ ఫిల్మ్ డీల్ ఎవరికి ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి. బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఇప్పుడు మరీ టెన్షన్ పడాల్సిన పరిస్థితిలో లేదు కానీ భారీ చిత్రాల కోలీవుడ్ దర్శకుడికి మాత్రం బలమైన హిట్ అవసరమే…

Related Articles

Latest Articles