నిందితుడు రాజు కోసం పోలీసుల గాలింపు.. కీలక ఆధారం లభ్యం?

హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని నిందితుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా డీజీపీ నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే గత ఆరురోజులుగా పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నా రాజు ఆచూకీ లభించకపోవడం గమనార్హం. నిందుతుడు నిర్మానుష్య ప్రదేశంలో దాక్కొని ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈక్రమంలోనే రాజుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే అతడు ఏం పని చేస్తాడు? అతడి భార్య, పిల్లలు వగైరా వివరాలన్ని సేకరించారు. ఈక్రమంలోనే గతంలోనే రాజుపై ఓ కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు విషయంలో చైతన్యపురి పోలీసులు రాజును పిలిచి విచారించారు. అప్పుడు పోలీసులు తీసిన ఫోటో ఇప్పుడు కేసులో నిందితుడిని గుర్తించేందుకు కీలకంగా మారింది.

నిందుతుడి రాజు గంజాయితోపాటు కల్లు, మద్యానికి బానిస అని పోలీసుల విచారణలో తేలింది. అతడు డబ్బు కోసం అడ్డా కూలీ పనులు చేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజు తన మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పోలీసులు కల్లు.. మద్యం దుకాణాలు.. లేబర్ అడ్డాల్లో గాలిస్తున్నారు. ఆరురోజులుగా నిందితుడి ఆచూకీ లభించకపోవడంతో అతడు నిర్మానుష్య ప్రదేశంలో తలదాచుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకండ్లతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు గాలించారు. రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైవేలపై గాలింపులు చేస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి లింక్ ఉన్న హైవేలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈమేరకు నిందితుడు రాజు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించిన ఆనవాళ్లు పోలీసులకు లభించాయి.

నిందితుడి దగ్గర సెల్ ఫోన్ లేకపోవడంతో అతడిని పట్టుకోవడం పోలీసులకు కొంచెం కష్టంగా మారింది. అయితే ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని ఎలాగైనా పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను కూడా అలెర్ట్‌ చేశారు. అన్ని బస్టాండ్‌లు, బస్సుల్లో నిందితుడికి సంబంధించిన పోస్టర్లు అంటించారు. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. నిందితుడి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆచూకీ తెలిపినవారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది.

Related Articles

Latest Articles

-Advertisement-