కేరళలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌.. !

భారత్‌లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు కేరళలో కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే కేరళలో నిత్యం 10 వేలకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. కేరళలో కొవిడ్‌ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 40 శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది.

మరోవైపు.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ వేగంగా అందిస్తోంది. అక్కడ 18 ఏళ్ల వయసున్న జనాభాలో 21 శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందించింది. దేశ సరాసరి 9.9 శాతం ఉండగా కేరళ అంతకుమించి పంపిణీ చేసింది. ఐసీఎంఆర్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6 శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే, కేరళలో మాత్రం 42.7 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 48 శాతం కేరళ ప్రజలకు వైరస్‌ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతానికన్నా తక్కువగానే నమోదవుతోంది. కేరళలో మాత్రం గడిచిన 6 వారాలుగా 10 నుంచి 12 శాతం రికార్డవుతోంది. నిత్యం 10 నుంచి 15 వేల మందిలో వైరస్‌ బయటపడుతోంది. ఆస్పత్రిలో చేరికలు మాత్రం కాస్త తగ్గాయి. రాష్ట్రంలో భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండటంతోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సర్కార్‌ అప్రమత్తం అవుతోంది.. గత వారం వీకెండ్‌లో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేసిన ప్రభుత్వం.. ఈ వారంలో కూడా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటించింది.. శని, ఆదివారాల్లో అంటే ఈ నెల 31, ఆగస్టు 1వ తేదీ.. ఇలా రెండు రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-