సీఎం కేసీఆర్‌ రైతులకు పట్టిన పెద్ద చీడ: కోదండరాం

రైతుల కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ధర్నాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు ఓవైపు చస్తున్నా.. కేసీఆర్ సర్కార్‌ పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు చీడ పడితే ఏం చేయాలో తెలుసన్న ఆయన.. రైతులకు పట్టిన అతిపెద్ద చీడపీడ కేసీఆరే అని విమర్శించారు. ఒకప్పుడు వ్యవసాయం పండుగ అన్న కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు దండగ అంటున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిలబడలేని పరిస్థితికి కేసీఆర్‌ తీసుకొచ్చారన్నారు. తెలంగాణలోని కల్లాల వద్ద ఏ రైతును కదిలించినా ఒక్కటే మాట చెబుతున్నారన్నారు.

ఇలా అయితే బతకడం కష్టం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని, వ్యవసాయం కూడా చేయలేమని అంటున్నారని కోదండరాం అన్నారు. అయినా ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నలుగురికి తిండి దొరకాలని కష్టపడి పంటను పండిస్తే మమ్ముల్ని ఆదుకోకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని రైతులు అంటున్నారని కోదండరాం అన్నారు. మరోవైపు కల్లాల వద్ద అనేక సమస్యలు ఉన్నాయని, తరుగు పేరుతో అధిక ధాన్యం కోతలు పెడుతున్నారని, కల్లాల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేవని రైతులు చలికి వణుకుతూ, కల్లాల వద్ద మరణిస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని కోదండరాం ఆరోపించారు. త్వరలో రైతులు కేసీఆర్‌ సర్కార్‌ను భూ స్థాపితం చేస్తారని హెచ్చరించారు కోదండరాం.

Related Articles

Latest Articles