కైపెక్కించిన కత్రినా కైఫ్!

(జూలై 16న కత్రినా కైఫ్ పుట్టినరోజు)

కత్రినా కైఫ్ తెరపై కనిపిస్తే చాలు కనకవర్షాలు కురిశాయి. ఇప్పటికీ బాలీవుడ్ లో అగ్రకథానాయికగా సాగుతోన్న కత్రినా కైఫ్ కాల్ షీట్స్ కు డిమాండ్ తగ్గనే లేదు. ఆరంభంలో కత్రినాకు ఆమె ఎత్తు అడ్డంకిగా మారింది. అంత ఎత్తులో, ముఖంలో ఏలాంటి భావాలు పలకడం లేదని అందరూ ఎద్దేవా చేశారు. అయినా చిత్రసీమపై మనసు పారేసుకున్న కత్రినా కైఫ్ అవేవీ పట్టించుకోకుండా ప్రయత్నాలు మొదలు పెట్టింది. సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ అనే గుర్తింపుతో బాలీవుడ్ లో ప్రవేశించిన కత్రినా కైఫ్ ‘బూమ్’ సినిమాలో తొలిసారి తళుక్కుమంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢామ్ అంది. ఆమె నటించిన రెండో చిత్రమే తెలుగు సినిమా ‘మల్లీశ్వరి’. వెంకటేశ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అంటే కత్రినాకు తొలి సక్సెస్ ను రుచి చూపించింది తెలుగు సినిమానే అన్న మాట! ఆ తరువాత బాలీవుడ్ లో మంచి అవకాశాలు రాసాగాయి. వచ్చిన ప్రతీ ఛాన్స్ నూ వినియోగించుకుంటూ ముందుకు సాగింది కత్రినా. బాలకృష్ణ సరసన ‘అల్లరి పిడుగు’లో జోడీ కట్టింది. బాలీవుడ్ లో బిజీ కావడంతో మళ్ళీ తెలుగు సినిమావైపు చూడలేదు కత్రినా.

కత్రినా కైఫ్ లండన్ లో మోడల్ గా అలరించింది. తరువాత కైజాద్ గుస్తాద్ దర్శకత్వంలో ‘బూమ్’లో నటించింది. సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ క్యు కియా?’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తరువాత అక్షయ్ కుమార్ తో జోడీ కట్టి “నమస్తే లండన్, వెల్ కమ్, సింగ్ ఈజ్ కింగ్, దే ధనా ధన్, తీస్ మార్ ఖాన్” చిత్రాలలో అలరించింది. అక్షయ్-కత్రినా హిట్ పెయిర్ గా నిలిచారు. సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గా వచ్చినా, తరువాత ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’లో రణబీర్ కపూర్ తో నటించి, అతనితో ప్రేమాయణం సాగించింది. వారిద్దరూ నటించిన ‘రాజ్ నీతి’ కూడా ఆకట్టుకుంది. సల్మాన్‌ ఖాన్ తో నటించిన ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’ చిత్రాలు కూడా మంచి ఆదరణ పొందాయి. ఆమిర్ ఖాన్ తో ‘ధూమ్-3’లో నటించి మురిపించింది. ‘జిందగీ న మిలేగీ దుబారా’లోనూ కనువిందు చేసింది. అయితే ఆమె అసలైన ఎస్సెట్ డాన్స్ అనే చెప్పాలి. ఒకప్పుడు డాన్సులు రావని గేలిచేసిన వారే, తరువాత కత్రినా డాన్సుల కోసమే ఆమెతో పనిచేయడం విశేషం. ‘తీస్ మార్ ఖాన్’లో కత్రినా డాన్స్ చేసిన “షీలా కీ జవానీ…” సాంగ్ దేశాన్ని మొత్తం ఓ ఊపు ఊపేసింది. ఆ తరువాత అనేక చిత్రాలలో కత్రినా ఐటమ్ సాంగ్స్ లోనూ మురిపించడం విశేషం!

కత్రినా తరువాత పలువురు అందాలభామలు బాలీవుడ్ లో అడుగు పెట్టారు. వారు అగ్రపథంలో సాగుతున్నా, కత్రినా కైఫ్ స్టార్ డమ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ కత్రినా కాల్ షీట్స్ కాస్ట్లీ అనే చెప్పాలి. అయినా నిర్మాతలు ఆమె తమ చిత్రాల్లో నటిస్తే చాలు అని భావిస్తున్నారు. తనకు అచ్చివచ్చిన అక్షయ్ కుమార్ తో కత్రినా నటించిన ‘సూర్యవంశీ’ విడుదల కావలసి ఉంది. ‘ఫోన్ బూత్, టైగర్ 3’లోనూ కత్రినా నటిస్తోంది. జూలై 16తో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న కైఫ్ ఇంకా జనానికి కైపెక్కిస్తూనే ఉంది. ఆమె మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తారని ఆశిద్దాం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-