వరద బీభత్సం.. కపిలతీర్థంలోకి నో ఎంట్రీ

భారీవర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. కపిల తీర్థం వద్ద వరద నీరు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై నుంచినీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జలపాతం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. నీటి ప్రవాహం ధాటికి కూలిపోయింది పురాతన మంటపం. గడిచిన మూడు రోజులుగా కూలుతూ వస్తున్న మంటపం, గత రాత్రి మరింతగా కూలిపోయింది. దీంతో కపిలతీర్థంలోకి ఎవరినీ అనుమతించడం లేదు టీటీడీ అధికారులు.

కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది.

ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండలమీద 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. కానీ వర్షాల వల్ల కపిల తీర్థం తీవ్రంగా దెబ్బతింది. కపిల తీర్థంలో కోనేరుకు ఎదురుగా వున్న మండపము వరదల వల్ల కూలిపోయింది. మంటపం పునర్నిర్మించడానికి మరింత సమయం పట్టే అవకాశం వుందని టీటీడీ అధికారులు అంటున్నారు. వరద ప్రవాహం అదుపులోకి ఎప్పుడు వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.

Related Articles

Latest Articles