‘ఆ మూడు చెట్లు’ నాటమంటూ కంగనా స్పెషల్ మెసేజ్!

అద్భుతమైన నటనతోనో, జాతీయ అవార్డులతోనో లేదంటే కాంట్రవర్సీలతోనో వార్తల్లో ఉంటుంది కంగనా రనౌత్. అయితే, ఈ సారి కాస్త భిన్నంగా పచ్చనైన సందేశంతో నెటిజన్స్ ముందుకొచ్చింది. కంగనా 20 చెట్లు నాటింది. ఆ సమయంలో తీసిన ఫోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, చిన్నపాటి సందేశాన్ని కూడా తన ఫాలోయర్స్ కి ఇచ్చింది ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్…
ఈ మధ్య వచ్చిన తౌక్టే తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ లో కల్లోలం సృష్టించింది. ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు, ఈదురు గాలులు ముంచెత్తాయి. దాంతో చాలా చెట్లు నేల కూలాయి. కంగనా చెబుతోన్న దాని ప్రకారం ముంబై సిటీలోని 70 శాతం చెట్లు కూలిపోయాయట! అలాగే, గుజరాత్ లోనూ దాదాపు 50 వేల చెట్లు నేల కూలాయని ఆమె అంటోంది. ఆ విషయాన్ని చెబుతూ, కంగనా, అందర్నీ చెట్లు నాటమని పిలుపునిచ్చింది. ప్రతీ యేడు వేల చెట్లు కూలిపోతుంటే కొత్తవి ఎక్కడ్నుంచీ వస్తాయని ప్రశ్నించింది. వృక్షాలు కావాలంటే దశాబ్దాలు పడుతుందని గుర్తు చేసింది!
కంగనా స్వయంగా 20 చెట్లు నాటుతూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి, గుజరాత్ ట్యూరిజం శాఖకి ప్రత్యేక సూచన చేసింది. చెట్లు నాటమనటమే కాదు ఏ మొక్కలైతే మంచివో కూడా వివరించింది. వేప, రాగి, మర్రి చెట్లు శ్రేష్ఠమని ఆమె అభిప్రాయపడింది. వాటి వల్ల వాతావరణం కూడా శుద్ధి అవుతుందనీ, ఆక్సిజన్ ఎక్కువగా పరిసరాల్లోకి వదులుతాయని తెలిపింది! చూడాలి మరి, కంగనా కామెంట్స్ ఎవరి మీద ప్రభావం చూపుతాయో! ఆమెతో గొడవ పడుతోన్న మహారాష్ట్ర సర్కార్ వింటుందో లేదో కంగనా ఎప్పుడూ సపోర్ట్ చేసే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ అమలు చేస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-