పాన్ ఇండియా మూవీ లో ‘సీత’గా కంగనా రనౌత్

ఇప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించి కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా ‘తలైవి’ చిత్రంలో నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత పాత్రను పోషించింది. అలానే ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా నటిస్తున్న సినిమా ఒకటి సెట్స్ పై ఉంది. మరో రెండు మూడు సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి. విశేషం ఏమంటే గత కొంతకాలంగా మహాసాధ్వి సీత పాత్రను కంగనా రనౌత్ పోషించబోతోందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే… కంగనా రనౌత్ కోరుతున్న రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేక సీత పాత్రకు వేరే నటిని ఎంపిక చేయబోతున్నారనే వార్తలు సైతం వచ్చాయి. ఈ విషయమే కంగనా రనౌత్ స్పష్టంగా సమాధానం చెప్పకపోయినా, తనకు రెమ్యూనరేషన్ కంటే రెస్పెక్ట్ ప్రధానమని, గౌరవం లభించే ప్రాజెక్ట్స్ ను తాను వదులుకోనని తెలిపింది.

ఇదిలా ఉంటే… తాజాగా అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఎస్.ఎస్. స్టూడియోస్ కు చెందిన సలోని శర్మ నిర్మించబోతున్న ‘ది ఇన్ కారనేషన్ : సీత’ మూవీలో కంగనా రనౌత్ ను ఎంపిక చేసినట్టు ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘తలైవి’కి సైతం ఆయనే కథను అందించడం విశేషం. ‘సీత’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. భావితరాలకు సీత చరిత్రను అందచేయడమే లక్ష్యంగా తానీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సలోని శర్మ తెలిపారు. ఈ సినిమాకు అధికారిక ప్రకటన సందర్భంగా ఓ పోస్టర్ నూ దర్శక నిర్మాతలు విడుదల చేశారు.

పాన్ ఇండియా మూవీ లో 'సీత'గా కంగనా రనౌత్

Related Articles

Latest Articles

-Advertisement-