రాజ్యసభ ఆశిస్తున్న కల్వకుంట్ల కవిత..!

టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి..? స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన వారిలో ఒకరిని ఢిల్లీకి పంపుతారా..? గులాబీ దళపతి కేసీఆర్ ప్లాన్ ఏంటి?

రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారు?

అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బండ ప్రకాశ్ ముదిరాజ్ మూడేళ్ల ఎనిమిది నెలలే ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కూడా అంతే ఉత్కంఠగా రాజ్యసభ పదవీ వదిలేసి ఎమ్మెల్సీ పదవీకి ఎన్నికయ్యారు. తెలంగాణ కేబినెట్‌లోకి తీసుకునే ఉద్దేశంతో ఆయన్ను ఎమ్మెల్సీ చేసినట్టు సమాచారం. 2018 మార్చిలోరాజ్యసభకు బండ ప్రకాశ్ ఎన్నికయ్యారు. మరో రెండు సంవత్సరాల ఎనిమిది నెలల సమయం మిగిలి ఉంది. ఇప్పుడు ఈ పదవి టీఆర్‌ఎస్‌లో ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ.

ఢిల్లీ వెళ్లేందుకు కవిత ప్లాన్‌..!

కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు.భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపుతో వచ్చిన ఉపఎన్నికలో నాడు కవిత ఎమ్మెల్సీగా గెలిచారు.
దాదాపు రెండేళ్లపాటు ఆ పదవిలో ఉండగా.. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కవిత. మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో క్రియాశీలం కావడానికి ప్రయత్నం..!

ఎమ్మెల్సీగా ఇప్పుడు మరోసారి గెలిస్తే 2024లో సాధారణ ఎన్నికల సమయానికి పదవీకాలం పూర్తికాదు. రాజ్యసభ ఉపఎన్నికకు వెళితే మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ఆలోచిస్తున్నారు కవిత. అలాగే రాజ్యసభకు ఎన్నికై ఢిల్లీలో క్రియాశీలం కావడానికి.. అధినేత కేసీఆర్‌ను కవిత కోరినట్టు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితులతో హస్తినకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 23 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఆలోపు కవిత ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తారా లేదా అన్నది తేలనుంది. ఒకవేళ నామినేషన్‌ వేయకపోతే.. రాజ్యసభకు పంపుతారా అన్నది చూడాలి.

వచ్చే ఏడాది రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ..!

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రాజ్యసభకు పంపాలనే ఆలోచన కూడా ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వినోద్ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. వచ్చే ఏడాది మరో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ పదవీ కాలం ముగియనుంది. ఇప్పుడు ఎవరిని రాజ్యసభకు పంపుతారు ? వచ్చే ఏడాది ఎవరిని పంపుతారు ? అన్నది ఉత్కంఠగా ఉంది.

Related Articles

Latest Articles