దూలం చుట్టూ అసమ్మతి స్వరం

ఆయన మొదటిసారి ఎమ్మెల్యే. అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో సొంత కేడరే ఆయనకు పక్కలో బల్లెంలా తయారైందట. విపక్షాల సంగతి ఎలా ఉన్నా.. స్వపక్షం నుంచే ఎమ్మెల్యేకు అవినీతి ఆరోపణలు తప్పడం లేదు. సోషల్‌ మీడియాలోనూ కామెంట్స్‌.. పోస్టింగ్స్‌తో కేక పెట్టిస్తున్నారు.

వైసీపీలోని వ్యతిరేకవర్గం దెబ్బకు ఉక్కిరిబిక్కిరి..!
కృష్ణాజిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో కైకలూరు ఒకటి. పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా బోర్డర్‌లో ఉంటంతో.. ఇక్కడ ఎవరు గెలిచినా ప్రత్యేకమే. అటువంటి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు దూలం నాగేశ్వరరావు. ఆయన DNRగా స్థానికులకు సుపరిచితం. అధికారపార్టీ శాసన సభ్యుడైనా.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సొంతపార్టీవర్గం దెబ్బకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఎమ్మెల్యే.

ఎమ్మెల్యేకు సొంతపార్టీ కేడర్‌ నుంచి రివర్స్‌ పంచ్‌లు
గతంలో సర్పంచ్‌గా పనిచేశారు DNR. 2014లోనే వైసీపీ నుంచి బరిలో దిగాలని చూసినా.. కొన్ని కేసుల్లో ఆరోపణలు రావడంతో ఉప్పల రాంప్రసాద్‌ను పార్టీ బరిలో నిలిపింది. చివరకు 2019 నాటికి పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని.. వైసీపీ అధిష్ఠానాన్ని మెప్పించి.. పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు DNR. వైసీపీ అధికారంలోకి రావడంతో.. అదే సరైన టైమ్‌ అనుకున్నారో ఏమో పూర్తిస్థాయిలో ఆధిపత్యం మొదలు పెట్టేశారట. ఈ క్రమంలో పార్టీ కేడర్‌తో దూరం వచ్చిందట. గెలిపించడానికి పనికొచ్చిన తాము.. మిగతా విషయాల్లో గుర్తుకు రాలేదా అని గుర్రుగా ఉన్న పార్టీ శ్రేణులు DNRకు రివర్స్‌ పంచ్‌లు ఇస్తున్నాయి.

రూ.250 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ
ప్రస్తుతం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యతిరేక వర్గంలో బీసీ, ఎస్సీ నేతలు చేరిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నరేళ్ల కాలంలో DNR 250 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ రాష్ట్ర బీసీ కార్యదర్శి పాపారావు, మాల మహానాడు నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ దగ్గర 60 ఎకరాలు, విశాఖలో మరో 50 ఎకరాలు, కైకలూరులో 50 ఎకరాలను DNR కొనుగోలు చేసినట్టు వ్యతిరేక వర్గం లెక్కల చిట్టా బయటపెట్టింది. ఇదేకాదు.. కొల్లేరులోని వందల ఎకరాలను బినామీలకు చెరువులుగా ఇచ్చారని ఆరోపిస్తోంది DNR వ్యతిరేకవర్గం. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవులతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో YCP నుంచి పోటీ చేసేందుకు భారీగా వసూలు చేశారన్నది వ్యతిరేకవర్గం ఆరోపణ. పైగా సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

వ్యతిరేకవర్గం ఆరోపణల్లో పసలేదంటున్న ఎమ్మెల్యే వర్గం
వ్యతిరేకవర్గం చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజాలు లేవని.. అవి పసలేని విమర్శలుగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వర్గం కౌంటర్‌ ఇస్తోంది. అయితే కైకలూరులో ఎమ్మెల్యేకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రచారం మొదలైంది. సోషల్‌ మీడియాను ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఓ రేంజ్‌లో వాడుకుంటోదట. పోస్టింగ్‌లు.. కామెంట్స్‌ హోరెత్తిపోతున్నాయి. తొలుత ఈ అంశాన్ని లైట్‌ తీసుకున్నా.. సమస్య ముదురి DNRకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. టీడీపీ సైతం వ్యతిరేకవర్గం చేస్తున్న ఆరోపణలకు వంత పాడటంతో ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో గెలుపుకోసం అన్ని వర్గాలతో సన్నిహితంగా ఉన్న DNR.. గెలిచాక పార్టీలో కొందరిని దూరం పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ఆ ప్రభావమే కైకలూరు వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ చిచ్చు ఇక్కడితో ఆగుతుందో.. మరింత రచ్చకెక్కుతుందో చూడాలి.

Related Articles

Latest Articles