కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం.. ఎందుకింత విశిష్టత

కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలతోరణాన్ని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని చెబతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయంటారు. జ్వాలాతోరణ దర్శనం వలన పాపాలు పోతాయి. మన జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయంటారు.కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి జ్వాల వెలిగిస్తారు. ఆ మంట కిందనుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు.

జ్వాలాతోరణం వల్ల నరక ప్రాప్తి వుండదని పెద్దలు చెబుతారు. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ అగ్నితోరణం గుండా లోనికి వెళతారని ప్రతీతి. పాపాత్ములకు వేసే మొదటి శిక్ష అగ్నితోరణం. యమలోకంలోకి అడుగుపెట్టకుండా ఉండాలన్నా, ఈ శిక్షల నుంచి తప్పించుకోవాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక వుండాలంటారు. అందుకే ఎంతో పవిత్రమయిన కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమ ద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుందంటారు.

జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి మోసినా, వెనుక నడుస్తూ పరమేశ్వరా నేను ఇప్పటి వరకూ చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి..మళ్లీ ఎలాంటి తప్పులు చేయకుండా సన్మార్గంలో నడిపించమని కోరుకోవాలి. జ్వాలాతోరణం పూర్తైన వెంటనే పూర్తిగా కాలకుండా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెట్టుకుంటారు. దీని వల్ల దుష్టశక్తులు మన ఇంటిలోకి, పొలాల్లోకి రాకుండా వుంటాయని నమ్ముతారు.

Related Articles

Latest Articles