కోవిడ్ దండయాత్ర.. యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి మరోసారి అగ్రరాజ్యం అమెరికాపై దండయాత్ర చేస్తోంది.. ఒమిక్రాన్‌ విజృంభణతో యూఎస్‌ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది​. ఇంట్లోనే కోవిడ్​-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్​ కిట్లతో పాటు వైరస్​ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్​95 మాస్క్​లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు వచ్చే వారం నుంచి వెయ్యి మంది సైనిక వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామని తెలిపారు. వైద్య సౌకర్యాలను పెంచటం, సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒమిక్రాన్​ వేరియంట్​ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: కోవిడ్‌, ఒమిక్రాన్‌పై నిపుణుల హెచ్చరిక

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలోనే.. చాలా మంది వైద్య సిబ్బంది వైరస్​బారినపడి హోమ్​క్వారంటైన్​కు వెళ్తున్నారు. దీంతో పెద్ద పెద్ద ఆసుపత్రులు సైతం సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. వైరస్‌కు గురైన సిబ్బంది సైతం పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ కొరతను తగ్గించేందుకు ఫెడరల్​మెడికల్​సిబ్బందిని ప్రభుత్వం… పలు రాష్ట్రాలకు పంపించింది. అదనంగా మిలటరీ వైద్యులను అవసరమైన ప్రాంతాలకు పంపనున్నారు. కాగా, అమెరికాలో 24 గంటల్లో కొత్తగా 8 లక్షల మందికి పైగా పాజిటివ్​గా తేలింది. 1,969 మంది వైరస్​తో మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8.69 లక్షలు దాటింది. కేసుల సంఖ్య 6.23 కోట్లను అధిగమించింది.

Related Articles

Latest Articles