వినాయక చవితి వేడుకలపై బీజేపీ ధర్నాల్లో కనిపించని జనసేన!

ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలైనా.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాల్లో కలిసి సాగడం లేదు. నేతలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కిందిస్థాయిలో రెండు పార్టీల వర్గాలకు పొసగడం లేదట. ఏంటా పక్షాలు..? ఏపీ రాజకీయాల్లో చర్చగా మారిన మిత్రపక్షాలేంటి?

నేతలు కలిసి మాట్లాడుతున్నా.. వేర్వేరుగా పోరాటాలు!

2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో రాజకీయాలు చాలా మారిపోయాయి. బీజేపీపై కాలుదువ్వి.. వామపక్షాలతో నడిచిన జనసేన తర్వాత కమలదళంతో జట్టుకట్టింది. 2024లో డిల్లీలో మోడీ.. ఏపీలో మా జోడీ అంటూ భారీ స్లోగన్స్ ఇచ్చారు కూడా. ఒకానొక సందర్భంలో ఉమ్మడిపక్షాల సీఎం అభ్యర్థి ఎవరన్నది చర్చలో పెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం బీజేపీ, జనసేనలు ఒకరిపై ఒకరు నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోంది. రెండు పార్టీల నాయకులు అప్పుడప్పుడు కలుస్తున్నా.. రోడ్డెక్కే విషయంలో ఎవరి దారి వారిదే.

వినాయక చవితి వేడుకలపై బీజేపీ ధర్నాల్లో కనిపించని జనసేన!

ఏపీలో ఏడాదిగా బీజేపీ కార్యకలాపాలు పెరిగాయి. దేవాలయాలపై దాడులు.. ప్రజా సమస్యలపై ధర్నాలు చేస్తున్నాయి. తాజాగా వినాయక చవితి వేడుకల విషయంలో గళమెత్తారు కమలనాథులు. జనసేనతో మళ్లీ దోస్తీ మొదలైన తర్వాత ఇవన్నీ బీజేపీ ఒంటరిగా చేస్తున్న కార్యక్రమాలే తప్ప మిత్రపక్షం భాగస్వామ్యం లేదు. బీజేపీ పిలవడం లేదా.. పిలిచినా జనసేన రావడం లేదా అన్నది చర్చగా ఉంది.

రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటం.. జాడ లేని బీజేపీ!

ఏపీలో జనసేన కూడా ఈ మధ్య కొన్ని అంశాలపై నిరసనలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమిస్తున్నారు జనసైనికులు. రోడ్లు బాగు చేయాలని ప్రభుత్వానికి నెల రోజుల టైమ్‌ ఇచ్చారు. ఈ రోడ్ల ఉద్యమంలో జనసేన ఒక్కటే కనిపిస్తోంది కానీ.. బీజేపీ భాగస్వామ్యం లేదు. ఈ పోరాటంలో బీజేపీని పిలవలేదా? లేక బీజేపీని వద్దని అనుకున్నారో వారికే తెలియాలి. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా విడివిడిగా పయనిస్తున్నారు తప్ప రెండు పార్టీలు కలిసి సాగడం లేదు.

రెండు పార్టీల బంధం చివరి వరకు కొనసాగుతుందా?

ఈ రెండు పార్టీల మధ్య పరిణామాలను గమనించిన వారు మాత్రం… బీజేపీ, జనసేన బంధం ఎక్కువ రోజులు కొనసాగుతుందో లేదోనని సందేహిస్తున్నారట. సంస్థాగతపరంగా బీజేపీ బలంగా ఉంటే.. శ్రేణుల పరంగా జనసేన పటిష్ఠంగా ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి ఉద్యమిస్తే పొలిటికల్‌ చిత్రం మరోలా ఉండొచ్చు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండటంతో.. పార్టీ వ్యవహారాలను నాదెండ్ల మనోహర్‌ చూసుకుంటున్నారు. రెండు పార్టీల పెద్దలు సమన్వయ భేటీ పేరుతో మాట్లాడుకోవడం తప్ప.. ఉద్యమాల్లో కోఆర్డినేషన్ లేదు.

వీర్రాజును అరెస్ట్‌ చేస్తే.. స్పందించని పవన్‌!

చవితి ఉత్సవాలపై పెట్టిన ఆంక్షలను నిరసిస్తూ కర్నూలులో బీజేపీ నేతలు దీక్షలు చేస్తే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు. వీర్రాజు అరెస్ట్‌కు వ్యతిరేకంగా లేదా బీజేపీ నేతలకు మద్దతుగా పవన్‌ కల్యాణ్ నుంచి ఒక ట్వీట్‌ లేదు. వ్యక్తిగతంగా పవన్‌, వీర్రాజుల మధ్య అనుబంధం ఉన్నా.. పార్టీల పరంగా ఎక్కడో గ్యాప్‌ కనిపిస్తోంది. ఏపీలో బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టాలని అనుకున్నప్పుడు మిత్రపక్షాలు ఐక్యంగా కాకుండా.. వేర్వేరుగా పోరాటాలు చేయడమే రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. మరి.. ఈ లోటును ఆ రెండుపార్టీలు గుర్తించాయో లేదో కానీ.. తరచూ చర్చల్లోకి మాత్రం వస్తున్నాయి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-