ఉప ఎన్నికపై జనసేనాని మౌనం.. దేనికి సంకేతం?

బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకోనుంది. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఓటమిని ఊహించి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో బద్వేల్ వైసీపీ అభ్యర్థి గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తోంది. అయితే అనుహ్యంగా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పోటీలో నిలిచాయి. బీజేపీ తరుఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ బద్వేల్ లో ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే ప్రచారం ముగియడానికి మరో వారం రోజుల సమయం ఉన్నా జనసేనాని మాత్రం బద్వేల్ లో ప్రచారం చేయడంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. దీంతో ఆయన ప్రచారానికి వస్తారా? లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

గత సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన మధ్య మైత్రీబంధం నెలకొంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ఆపార్టీ నేతలు ప్రకటించారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక నుంచి ఇరుపార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు కన్పిస్తోంది. తిరుపతి పార్లమెంట్ సీటు కోసం జనసేన పట్టుబట్టింది. అయితే ఆ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ తరుఫున జనసేనాని ప్రచారం చేశారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థి దాదాపు 3లక్షల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ రెండోస్థానంలో ఉండగా బీజేపీ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

ఆ తర్వాతి నుంచి ఇరుపార్టీలు ఎవరికీ వారు కార్యక్రమాలు చేస్తూ వెళుతున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో జనసైనికులు, అలాగే జనసేన కార్యక్రమాలో బీజేపీ కార్యకర్తలు ఎక్కడ కన్పించడం లేదు. దీంతో ఈ పార్టీల మధ్య పొత్తు చెడిందనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని భావించారు. ఈ సీటు ఎలాగో ఓడిపోయే సీటే కావడంతో బీజేపీ జనసేనకు మద్దతు ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే అనుహ్యంగా జనసేనాని బద్వేల్ లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.

బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణికే వైసీపీ సీటు ఖరారు చేయడంతో రాజకీయ సంప్రదాయాలకు గౌరవిస్తూ జనసేన పోటీ నుంచి తప్పుకుంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమంటూ బీజేపీ బద్వేల్ లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. అయితే బీజేపీకి ఇక్కడ స్థానికంగా బలమైన అభ్యర్థి దొరకకపోవడంతో ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించి ప్రచారం చేపట్టింది. తమ తరుఫున పవన్ కల్యాణ్ బద్వేల్ లో ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు కొన్నిరోజులుగా చెబుతూ వస్తున్నారు.

జనసేనాని మాత్రం బద్వేల్ లో ప్రచారం చేయడంపై మౌనం ఉంటున్నారు. అయితే ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ మాత్రం తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రచారానికి మరో వారం రోజుల గడువే ఉన్నా జనసేనాని మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఎక్కడ కూడా ప్రకటించడం లేదు. దీంతో ఆయన ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకపోవచ్చనే టాక్ బలంగా విన్పిస్తోంది. అదే కనుక జరిగితే బీజేపీ పరువుపోయే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ ను బీజేపీ ప్రచారానికి ఏమేరకు తీసుకొస్తుందనే మాత్రం ఆసక్తిని రేపుతోంది.

Related Articles

Latest Articles