‘ట్రిపుల్ ఆర్’ ఆత్మను ‘జననీ’ గీతంతో ఆవిష్కరించిన కీరవాణి!

దర్శక ధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’లోని జననీ గీతం విడుదలైంది. ఎప్పుడెప్పుడు ఈ పాటను చూద్దామా అని ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అభిమానుల దాహార్తిని ఈ పాట తీర్చింది. దీంతో సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ కావడం మొదలైంది. 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ‘ట్రిపుల్ ఆర్’లోని జననీ గీతాన్ని సైతం ఐదు భాషల్లో విడుదల చేశారు రాజమౌళి. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచి, పాడటంతో పాటు ఈ గీతానికి రచన చేశారు. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ రీ-రికార్డింగ్ చేసే క్రమంలో దాని ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేశారు కీరవాణి. సినిమాలో కోర్ పాయింట్ ను గుర్తించి, దాన్ని పాట రూపంలో తెలిపారు.

‘జననీ ప్రియభారత జననీ’ అంటూ సాగే ఈ గీతం మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జరుగుతున్న అమృతోత్సవానికి నివాళిలా అనిపిస్తోంది. ఎన్టీయార్, రామ్ చరణ్ తో పాటు అలియాభట్ సైతం ఈ పాటలో కనిపించింది. అలానే అజయ్ దేవగణ్, ఆయన భార్యగా నటించిన శ్రియా మధ్య ఆసక్తికర సంభాషణలకూ ఇందులో రాజమౌళి చోటిచ్చారు. స్టార్స్ దగ్గర నుండి బాల నటులు, జూనియర్ ఆర్టిస్టులు సైతం ఇందులోని ప్రతి సన్నివేశానికి ప్రాణం పెట్టి చేశారని ఈ సాంగ్ చిత్రీకరణ చూస్తే అర్థమౌతోంది. సినిమాలోని హృదయవిదారక సన్నివేశాలను ఈ పాట నేపథ్యంలో చూస్తే రోమాంచితమవ్వడం ఖాయం. ఇస్ మిట్టీసే తిలక్ కరో అన్నచందంగా నీ పాదధూళి తిలకమై అని సాగిందీ గీతం. పాటలో పేర్కొన్నట్టుగా అరినాశ గర్జనములై… ఈ సినిమా అఖండ విజయం సాధించడం ఖాయమని ఈ పాట చూస్తే అర్థమౌతోంది. ముందు వచ్చిన ‘నాటు నాటు’ సాంగ్ తో కుర్రకారుని కిర్రెక్కించిన రాజమౌళి, ‘జననీ’ గీతంతో ప్రతి ఒక్కరి హృదయాలను ఆర్ద్రతతో నింపేశాడు.

Related Articles

Latest Articles