హీరో కృష్ణ చేతుల మీదుగా ‘జై విఠ‌లాచార్య’ బుక్ ఫస్ట్ లుక్!

తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న చరిత్ర ఆయన సొంతం. టాప్ స్టార్స్ నుంచి న్యూ స్టార్స్ వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయనపై సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అది. దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరిస్తూ వచ్చిన విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేస్తున్నాడు సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ. ఆ పుస్తకానికి ‘జై విఠలాచార్య’ అని పేరు పెట్టారు. ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు.

ఈ పుస్తకం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు హీరో కృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విఠలాచార్య దర్శకత్వంలో నేను ఒకే ఒక్క సినిమా చేశాను. అది ‘ఇద్దరు మొనగాళ్లు’. ఆ సినిమా హిట్ అయ్యింది. విఠలాచార్య గారు గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు. అనుకున్న బ‌డ్జెట్‌లో తీసేవారు. అలాంటి విఠలాచార్యగారిపై పుస్తకం తీసుకు రావటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

రచయిత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ‘జానపద బహ్మ విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం ‘జై విఠలాచార్య’. విఠలాచార్యగారు గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నిర్మాత కూడా. తక్కువ బడ్జెట్, తక్కువ లొకేషన్‌ల‌లో వేగంగా, పొదుపుగా సినిమాను ఎలా తీయవచ్చనేది ఆయన ఆచరించి చూపించారు. సినిమా నిర్మాణంలో ఆయన పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్యగారి శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేశాం. విఠలాచార్యగారు సినిమాను ఎంత వేగంగా తీసేవారో, అంతే వేగంగా ఈ పుస్తకాన్ని పూర్తి చేశాం. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’ అని అన్నారు. మూవీ వాల్యూమ్ షేక్ జిలాన్ బాషా మాట్లాడుతూ ‘పదమూడేళ్లుగా సినిమా జర్నలిస్టుగా ఉన్నాను. మూవీ వాల్యూమ్ పేరుతో వెబ్‌సైట్‌, యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వహిస్తున్నాను. పబ్లిషింగ్ రంగంలో ప్రవేశించాను. చిన్నారాయణ రాసిన తొమ్మిదో పుస్తకం ‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్‌ చేయడం ఆనందంగా ఉంది. కృష్ణగారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా బుక్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేయడం ముదావహం. సాధారణంగా సినిమాలకు ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేస్తుంటారు. ఓ బుక్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. డిసెంబర్‌ లో ‘జై విఠలాచార్య’ను అందుబాటులోకి తీసుకొస్తా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు కూడా పాల్గొన్నారు

Related Articles

Latest Articles