‘జై భీమ్’ ట్రైలర్ లో లాయర్ గా అదరగొట్టిన సూర్య!

‘చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. ఉండటానికి భూమి, కనీస ఆహారాన్ని పొందడానికి రేషన్ కార్డు, ఓటర్ల లిస్టులో పేరులేని గిరిజనులను తప్పుడు కేసుల్లో పోలీసులు ఇరికించినప్పుడు వారి తరఫున పోరాటం చేసే న్యాయవాదిగా సూర్య ఇందులో నటించారు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన లాయర్ పాత్రను రావు రమేశ్ పోషించగా, పోలీస్ అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించారు. స్వాతంత్రం వచ్చి యాభై సంవత్సరాలు అయినా భూమి కోసం, భుక్తి కోసం, తమ మనుగడ కోసం గిరిజనులు చేసిన పోరాటం నేపథ్యంలో 1995 నాటి నిజ సంఘటనల ఆధారంగా ‘జై భీమ్’ సినిమా రూపుదిద్దుకుంది.

ఆపన్నుల పక్షాన నిలిచిన ఈ లాయర్ ఎలాంటి కీలక భూమికను పోషించాడు, కోర్టులో వారికి న్యాయం దక్కనప్పుడు వీధిపోరాటానికి జనాలను ఎలా సమాయుత్తం చేశాడన్నదే ‘జై భీమ్’ కథాంశమని 2.30 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం సూర్య వరుసగా నాలుగు సినిమాలను నిర్మించి ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో ఇదొక సినిమా. త.సె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’లో ఇతర ప్రధాన పాత్రలను రజీషా విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ పోషించారు. సీన్ రోల్డాన్ సంగీతం అందించిన ‘జై భీమ్’ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు.

Related Articles

Latest Articles