నవంబర్ మాసం ఆ రెండు చిత్రాలదే!

చూస్తుండగానే ఈ యేడాది చివరి నెల డిసెంబర్ లోకి వచ్చేస్తున్నాం. అయితే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ నెలలోనే టాలీవుడ్ లో అత్యధికంగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. అంటే సగటున రోజుకు ఒక సినిమా విడుదలైంది. అందులో స్ట్రయిట్, డైరెక్ట్ ఓటీటీ, డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి. ఈ నెల ప్రారంభమే సూర్య నటించిన అనువాద చిత్రం ‘జై భీమ్’తో మొదలైంది. గిరిజనుల గోడుకు అర్థం పట్టే ఈ సినిమాలో మానవహక్కుల లాయర్ గా సూర్య నటించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు, అమెజాన్ ప్రైమ్ లో విశేషణ ఆదరణను చూరగొంది. ఇక దీపావళి కానుకగా తొలివారంలో ‘జై భీమ్’తో కలిసి ఐదు సినిమాలు వచ్చాయి. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ‘మంచి రోజులు వచ్చాయి’ ప్రేక్షకులకు మంచి అనుభవాలను అందించలేక పోయింది. కొత్త సీరిస్ ‘ఇటర్నల్స్’ సైతం నీరసపర్చింది. విశాల్, ఆర్య నటించిన ‘ఎనిమి’ సినిమా బోర్ కొట్టించింది. ఇక రజనీకాంత్ ‘పెద్దన్న’ మరీ పాతచింతకాయ పచ్చడి అనుభూతిని కలిగించింది.

రెండో వారాంతంలో ఆరు సినిమాలు వచ్చాయి. ‘రాజా విక్రమార్క, పుష్పక విమానం, తెలంగాణ దేవుడు, కపట నాటక సూత్రధారి, ది ట్రిప్’ స్ట్రయిట్ చిత్రాలు కాగా ‘కురూప్’ అనువాద చిత్రం. ఈ సినిమా కాస్తంత బాగానే అనిపించినా, ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. ఇక స్ట్రయిట్ చిత్రాలు సైతం అంతంత మాత్రంగానే కలెక్షన్లు రాబట్టాయి. మూడో వారాంతంలో ఏకంగా పదకొండు సినిమాలు వచ్చాయి. విశేషం ఏమంటే అవన్నీ కూడా స్ట్రయిట్ సినిమాలే. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా కమర్షియల్ గా ఓహో అనిపించలేదు. ఇదే వారంలో జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ ‘అద్భుతం’ మూవీతో జనం ముందుకు వచ్చింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేశారు. ఇక నవంబర్ లాస్ట్ వీకెండ్ లో ఆరు స్ట్రయిట్, రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో వెంకటేశ్ నటించిన ‘దృశ్యం 2’కు మంచి టాక్ వచ్చింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25న స్ట్రీమింగ్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చేలా ‘దృశ్యం -2’ను దర్శకుడు జీతూ జోసఫ్ తెరకెక్కించాడు.

అయితే ఈ నెల ప్రారంభంలో వచ్చిన ‘జై భీమ్’ కానీ చివరి వారంలో వచ్చిన ‘దృశ్యం -2’ కానీ థియేట్రికల్ రిలీజ్ కాకపోవడంతో వాటి కలెక్షన్లను రూపాయలలో చెప్పలేం. కానీ ఆ సినిమాలకు వచ్చిన స్పందన దృష్ట్యా ఈ రెండూ చిత్రాలపై జనం మొగ్గు చూపారని అనుకోవచ్చు. చివరి వారంలో వచ్చిన ‘అనుభవించు రాజా, భగత్ సింగ్ నగర్, 1977, క్యాలీఫ్లవర్‌’, అనువాద చిత్రాలు ‘ది లూప్, లాల్ బాగ్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. అలానే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అయిన నవీన్ చంద్ర, అవికాగోర్ ‘బ్రో’ చిత్రం సైతం వీక్షకులలో ఎలాంటి ఆసక్తిని కలిగించలేదు. మరి నందమూరి బాలకృష్ణ ‘అఖండ’తో మొదలయ్యే డిసెంబర్ నెల ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

Latest Articles