ఆదాయంపై గురి..వన్ టైం సెటిల్ మెంట్ కలిసొచ్చేనా?

ఏపీలో జగన్ ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వుంది. ఈ నేపథ్యంలో ఆదాయం సమకూర్చుకునేందుకు దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన ఇళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో వడి వడిగా అడుగులేస్తోంది ప్రభుత్వం. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం కింద రిజిస్ట్రేషన్లు చేసే అధికారాలను గ్రామ, వార్డు సెక్రటరీలకు దఖలు పరిచింది జగన్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆదాయంపై కన్నేసింది. ఈ పథకం ద్వారా ఖజానా నిండుతుందని ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని భావిస్తోంది.

ఆదాయంపై గురి..వన్ టైం సెటిల్ మెంట్ కలిసొచ్చేనా?

జగన్ తనకు అధికారం కట్టబెట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పనిలో పడ్డారు. గతంలో ఇంటి కోసం తీసుకున్న లబ్ధిదారుల రుణాలను మూడులక్షల వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే రెండునెలల క్రితమే ఏపీ క్యాబినెట్ దీనికి భిన్నంగా కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. చంద్రబాబు హయాంలోనే కాదు.. ఎన్టీఆర్ కాలం నుంచి ఇళ్ల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ధిదారుల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బులు కట్టించుకొని వారి ఆస్తులను వారిపేరిట రిజిస్ట్రేషన్ చేసిస్తారు. వీరినే ప్రభుత్వ హక్కుదారులుగా ప్రభుత్వం గుర్తించనుంది.

ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద లబ్ధిదారులు గ్రామాల్లో ఐతే రూ.10వేలు, పట్టణాల్లో అయితే రూ.15వేలు, నగరాల్లో ఐతే 20వేలు చెల్లించాలి. అదే లబ్ధిదారుల ఇళ్లను మరొకరు కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఈ డబ్బులకు రెట్టింపు చెల్లించాలి. అంటే గ్రామాల్లో 20వేలు, పట్టణాల్లో 30వేలు, నగరాల్లో 40వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎన్టీఆర్ హయాం నుంచి లెక్కలు వేస్తుండటంతో అప్పటి నుంచి ఇళ్లు భారీగానే చేతులు మారే అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సగటున ఒక్కో ఇంటికి 20వేలు లబ్ధిదారులు డబ్బులు చెల్లించినా దాదాపుగా ప్రభుత్వానికి 10వేల కోట్ల రాబడి రాగలదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10వేల కోట్లు అంటే మాటలు కాదు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం 50 లక్షల మంది పేదలు రుణాలు కట్టాల్సి ఉందని అంటున్నారు. వీరిలో 4.57లక్షల మంది పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో కనీసం సగం మంది పథకంలో డబ్బులు కట్టినా రూ.5వేల కోట్లుసర్కారు ఖజానాకు జమ అవుతాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వన్ టైం సెటిల్మెంట్ ను లబ్దిదారులు ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారో వేచిచూడాలి. తాజాగా గ్రామ, వార్డు సెక్రటరీలపై వన్ టైం సెటిల్ మెంట్ బాధ్యత పెట్టింది. వారు ఈ పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళతారో చూడాలి. వన్ టైం సెటిల్ మెంట్ వర్కవుట్ అయితే మాత్రం జగన్ సర్కార్ అప్పులు తెచ్చే బాధ కొంచెం తగ్గుతుంది.

Related Articles

Latest Articles