‘ఆదిపురుష్‌’ లో లంకేశ్‌ పని అయిపోయింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’. కరోనా సమయంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చాడు దర్శకుడు ఓమ్ రౌత్. ముంబైలో పరిస్థితులు సహకరించని సమయంలో హైదరాబాద్ లోనూ షూటింగ్ చేశాడు. త్రీడీ లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ మూవీలో టెక్నీషియన్స్ పడుతున్న కష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని లంకేశ్ గా నటించిన సైఫ్ అలీఖాన్ కూడా తెలిపారు. ‘ఒకరు దుస్తులు వేస్తుంటారు, మరొకరు మేకప్ చేస్తుంటారు. శరీరానికి అన్ని తరహాల్లో అలంకరణ చేశాక ఓ మాసం ముక్కలా మమ్మల్ని కెమెరా ముందు నిలబెట్టేవారు’ అని సరదాగా చెప్పుకొచ్చాడు.

Read Also : ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్

ఇంతకూ విషయం ఏమంటే… హిందీలో సినిమాలను యేళ్ళ తరబడి తీస్తారనే అపప్రధ ఒకటి ఉంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ దర్శకుడు ఓం రౌత్ ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన ‘ఆదిపురుష్‌’ షూటింగ్ ను చకచకా సాగిస్తున్నాడు. అంతేకాదు… లంకేశ్ పాత్రధారి సైఫ్ అలీఖాన్ పోర్షన్ ను పూర్తి చేసి, అతనికి వీడ్కోలు కూడా పలికేశాడు. ఇదే విషయాన్ని నిన్న మూవీ కస్ట్యూమ్ డిజైనర్ నచికేత్ బార్వే తెలిపారు. షూటింగ్ సమయంలో సైఫ్ ఎంతో సహకరించారని, ఆయనతో వర్క్ చేయడం ఆనందాన్ని కలిగించిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇక సైఫ్‌ అలీఖాన్ కు వీడ్కోలు పలుకుతూ, సెట్ లో కేక్ కట్ చేశారు. ఆ ఫోటోలను దర్శకుడు ఓంరౌత్ శనివారం ట్వీట్ చేశారు. సైఫ్ తో షూటింగ్ ఎంతో వినోదాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ‘తానాజీ’ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ‘ఆదిపురుష్’ కోసం వర్క్ చేయడం విశేషం. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానని సైఫ్ సైతం పేర్కొన్నాడు. మరి మిగిలిన నటీనటుల షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి.

-Advertisement-'ఆదిపురుష్‌' లో లంకేశ్‌ పని అయిపోయింది!

Related Articles

Latest Articles