విషాదాంతం… జనాన్ని ఆక‌ట్టుకుంటుందా!?

ట్రాజెడీ, కామెడీ, యాక్ష‌న్, థ్రిల్ల‌ర్… ఇలా సినిమాల్లో పలు తెగలు ఉన్నాయి. అయితే అన్నీ క‌లిపి రెండే రెండుగా విభ‌జించారు. అవే సుఖాంతం, దుఃఖాంతం. బాధ‌తో ముగింపు క‌నిపించే ఏ సినిమా అయినా ట్రాజెడీయే. ఇక సంతోషంగా ముగిసే ఏ చిత్ర‌మైనా హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ చివ‌ర‌లో మ‌ర‌ణిస్తే అది ట్రాజెడీయే, హీరో, హీరోయిన్ క‌లుసుకోక పోయినా దానినీ విషాదాంతం అనే చెప్పాలి. ఇలా సినిమా తొలినుంచీ సాగుతూ, ప్రేక్ష‌కుల ముందు వేలాది ట్రాజెడీస్ ను, అంత‌కు మించిన హ్యాపీ నోట్స్ ను చూపింది. అయితే సుఖాంతం అయిన చిత్రాలే అధిక శాతం విజ‌యాలు చ‌విచూశాయి. దుఃఖాంతాలు సైతం కొన్ని ఘ‌న విజ‌యాల‌ను సొంతం చేసుకున్న‌వి లేక‌పోలేదు. ఏది ఏమైనా ప్రేక్ష‌కుడు త‌న‌కు న‌చ్చిన వాటిని విజ‌య‌ప‌థంలో ప‌య‌నింప చేస్తాడు అన్న‌ది స‌త్యం. ఈ విష‌యాల‌న్నీ ఎందుకు చెప్పుకోవ‌ల‌సి వ‌చ్చిందంటే తాజాగా విడుద‌లైన సాయిధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్లో హీరో మ‌ర‌ణిస్తాడు. అంటే ఇది ట్రాజెడీయే. మ‌రి ఈ సినిమా ఈ యంగ్ హీరోకు ఎలాంటి రిజ‌ల్ట్ చూపిస్తుందో కానీ, మాస్ హీరోలు ట్రాజెడీస్ చేయ‌కూడ‌ద‌న్న‌ది ఓ సినిమా సూత్రంగా నిల‌చింది. మాస్ ను విశేషంగా ఆక‌ట్టుకున్న వారి చిత్రాల‌ను ప‌రిశీలిస్తే విషాదాంతాలు అంత‌గా అల‌రించ‌లేద‌ని తేలుతుంది.

అప్ప‌ట్లో…
చ‌రిత్ర‌లోకి తొంగి చూస్తే – చారిత్ర‌క‌, పౌరాణిక‌, జాన‌ప‌దాల‌ను మిన‌హాయిస్తే, సాంఘికాల‌లో విషాదాంతం అయిన చిత్రాలు అంత‌గా విజ‌యం సాధించ‌లేద‌నే చెప్ప‌వ‌చ్చు. య‌న్టీఆర్ విషాదాంతాల్లో ర‌క్త‌సంబంధం, మంచి-చెడు వంటి విజ‌యాలు ఉన్నాయి. ఇక ఏయ‌న్నార్ న‌టించిన ట్రాజెడీస్ లో దేవ‌దాసు, ప్రేమాభిషేకం క‌నిపిస్తాయి. ఏయ‌న్నార్ ట్రాజెడీ కింగ్ అని పేరు సంపాదించినా ఆయ‌న పాత్ర మ‌ర‌ణిస్తే అంత‌గా విజ‌యం సాధించ‌ని చిత్రాలూ ఉన్నాయి. ఇక రామారావుకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆయ‌న ధ‌రించిన పాత్ర మ‌ర‌ణిస్తే విజ‌యం సాధించ‌క పోయిన చిత్రాలు బోలెడు ద‌ర్శ‌న‌మిస్తాయి. అందుకే య‌న్టీఆర్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్టుగా క‌థ‌లో ఆయ‌న పాత్ర క‌నుమూయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకొనేవారు. లేదా జ‌నాన్ని మెప్పించ‌డం కోసం రెండు పాత్ర‌లు పెట్టి, వాటిలో ఓ పాత్ర‌ను క‌థానుగుణంగా క‌న్నుమూసేలా చేసేవారు. ఆ రీతిన ప్రేక్ష‌కుల మ‌దిలో రామారావు బ్ర‌తికే ఉన్నారు అనే భావ‌న క‌లిగించి ఘ‌న‌విజ‌యం సాధించిన సంద‌ర్భాలున్నాయి. అందుకు ఆయ‌న న‌టించిన స‌ర్దార్ పాపారాయుడు, కొండ‌వీటి సింహం వంటి చిత్రాలే నిద‌ర్శ‌నం. ఇక ఆయ‌న పోషించిన పాత్ర‌కు చివ‌ర‌లో మ‌ర‌ణశిక్ష విధించినా, లేక యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించినా త‌రువాతి సీన్ చూపించ‌కుండా జైలుకు పోయేలాగో, లేక ఆయ‌న ముఖంపైనో సినిమాను ముగించేవారు. అలా విజ‌యం సాధించిన చిత్రాల‌లో అన్న‌-త‌మ్ముడు ముందుగా క‌నిపిస్తుంది. ఆపై అఖండ విజ‌యం సాధించిన‌బొ్బ్బిలిపులి ద‌ర్శ‌న‌మిస్తుంది. హీరో, హీరోయిన్ క‌లుసుకోకుండా విడిపోయిన చిత్రాలూ ఉన్నాయి. అయితే అలాంటి వాటిలో య‌న్టీఆర్, ఏయ‌న్నార్ ఇద్ద‌రూ కొన్ని సార్లు విజ‌యం సాధించారు. మ‌రికొన్ని సార్లు ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు.

ఆ త‌రువాత‌…
రామారావు, నాగేశ్వ‌ర‌రావు త‌రువాతి త‌రం హీరోల‌యిన శోభ‌న్ బాబు, కృష్ణ‌, కృష్ణంరాజు సినిమాల్లోనూ వారికి ఉన్న ఇమేజ్ ప్ర‌కారం ఇంత‌కు ముందు చెప్పిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ చిత్రాలు తెర‌కెక్కించారు ద‌ర్శ‌కులు. శోభ‌న్ బాబు మ‌ర‌ణించిన పాత్ర‌లో రూపొందిన మ‌నుషులు మారాలి ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ త‌రువాత కొన్ని సినిమాల్లో ఆయ‌న పాత్ర దుఃఖాంతంగా ముగిసినా, అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు. ఇక కృష్ణ న‌టించిన దేవ‌దాసు, మ‌నుషులు-మ‌ట్టిబొమ్మ‌లు చిత్రాల‌లో ఆయ‌న పోషించిన పాత్ర‌లు క‌న్నుమూస్తాయి. ఈ చిత్రాలు ఘోరంగా దెబ్బ‌తిన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొనే కృష్ణ కూడా రెండు, మూడుపాత్ర‌లు పోషించి, వాటిలో ఓ పాత్ర క‌న్నుమూసేలా క‌థ‌లు రూపొందించుకున్నారు. కృష్ణంరాజుకు ఎంతో పేరు సంపాదించి పెట్టిన అమ‌ర‌దీపంలో ఆయ‌న పాత్ర క‌న్నుమూస్తుంది. అయినా ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ త‌రువాత వ‌చ్చిన క‌ట‌క‌టాల రుద్ర‌య్య‌లో జైలులో ఉండ‌గా, ఆయ‌న పాత్ర‌పై సినిమా ముగుస్తుంది. రంగూన్ రౌడీ వ‌చ్చే స‌రికి, శిక్ష అనుభ‌వించి, జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక నాయిక‌తో ఆడుతూ పాడుతూ ఉన్న‌ట్టు చూపించారు. ఇవే సూత్రాల‌ను త‌రువాతి త‌రంలో మాస్ హీరోలుగా నిల‌చిన చిరంజీవి, బాల‌కృష్ణ పాటించారు. అందువ‌ల్ల వీరిద్దరి సాంఘిక చిత్రాల‌లో వీరి పాత్ర‌లు దుఃఖాంతం కాకుండానే ర‌చ‌యితలు జాగ్ర‌త్త ప‌డేవారు. నిజానికి రాక్ష‌సుడు క‌థ‌లో నాయ‌కుని పాత్ర మ‌ర‌ణిస్తుంది. సినిమాలో చిరంజీవి న‌టించారు కాబ్ట‌టి, ఆ పాత్ర‌తో క‌థ‌ను సుఖాంతం చేశారు. అలాగే రక్త‌సిందూరం, జ్వాల‌చిత్రాల‌లో ఓ పాత్ర మ‌ర‌ణిస్తే, మ‌రో పాత్ర జీవిస్తుంది. నాగార్జున మ‌జ్ను విషాదాంత‌మైనా విజ‌యం సాధించింది. అయితే శివ‌లో మాత్రం ఆయ‌న పాత్ర‌కు ఏలాంటి శిక్ష వేస్తారో చూపించ‌కుండానే ప్రేక్ష‌కులకే తీర్పును వ‌దిలేశాడు ద‌ర్శ‌కుడు. ఇలా త‌రువాతి రోజుల్లోనూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సాగారు హీరోలు.

మ‌ర‌ణిస్తేనే… గ్రేట్!
రెండు ప్ర‌ధాన పాత్ర‌ల్లో చివ‌ర‌కు చ‌నిపోయే పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారో వారే జనం నుండి మంచి మార్కులు సంపాదించుకుంటార‌ని అనేక చిత్రాలు చాటాయి. ఇలాంటి విశ్వాసం హాలీవుడ్ సినిమాల్లోనూ ఉండేది. అక్క‌డ తెర‌కెక్కిన వెస్ట్ర‌న్ మూవీస్ లోనూ ఈ సెంటిమెంట్ ప‌నిచేసింది. య‌న్టీఆర్, ఏయ‌న్నార్ హీరోలుగా రూపొందిన ప‌ల్లెటూరి పిల్ల‌లో నాగేశ్వ‌ర‌రావు పాత్ర చివ‌ర‌కు క‌న్నుమూస్తుంది. ఆ పాత్రతోనే త‌న‌కు న‌టునిగా మంచిపేరు వ‌స్తుంద‌ని ఏయ‌న్నార్ భావించారు. ఆ చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత బి.ఏ.సుబ్బారావు సైతం ఏయ‌న్నార్ అభిలాష‌ను మ‌న్నించి, క‌థ‌లో క‌న్నుమూసే పాత్ర‌నే ఏయన్నార్ కు ఇచ్చారు. అయితే అందులో అందాల న‌టునిగా య‌న్టీఆర్ కు మంచి పేరు ల‌భించ‌డం విశేషం!

అక్క‌డా అంతే…
రాజ్ క‌పూర్, దిలీప్ కుమార్ క‌ల‌సి న‌టించిన అందాజ్లో దిలీప్ పాత్ర చివ‌ర‌లో హ‌త్య‌కు గుర‌వుతుంది. అలాగే రాజ్ పెళ్ళాడిన న‌ర్గీస్ కు శిక్ష ప‌డి ఆమె జెలుకు వెళ్తుంది. ఈ ముక్కోణ ప్రేమ‌క‌థ ఆ రోజుల్లో జ‌నాన్ని భ‌లేగా అల‌రించింది. అయితే చివ‌ర‌లో క‌న్నుమూసిన దిలీప్ పాత్ర‌పై జ‌నానికి సానుభూతి క‌ల‌గ‌డంతో ఆయ‌న‌కే మంచిపేరు ద‌క్కింది. అలాగే రాజేశ్ ఖ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్ క‌ల‌సి న‌టించిన ఆనంద్లో రాజేశ్ ఖ‌న్నా పాత్ర క‌న్నుమూస్తుంది. ఆ సినిమా న‌టునిగా రాజేశ్ ఖ‌న్నాకు ఎంత‌టి పేరు సంపాదించి పెట్టిందో అంద‌రికీ తెలుసు. ఆ త‌రువాత ఇదే రాజేశ్,అమితాబ్ క‌ల‌సి న‌టించిన‌న‌మ‌క్ హరామ్ చిత్రంలో రెండు ప్ర‌ధాన భూమిక‌లు ఉన్నాయి. అందులో సోము పాత్ర మ‌ర‌ణిస్తుంది. విక్కీ పాత్ర జీవిస్తుంది. క‌థ విన్న అమితాబ్, ఆ చిత్ర ద‌ర్శ‌కుడు హృషికేశ్ ముఖ‌ర్జీని సోము పాత్ర త‌న‌కు ఇవ్వ‌వ‌ల‌సిందిగా ఎంతో బ్ర‌తిమ‌లాడాడ‌ట‌! అయితే రాజేశ్ ఖ‌న్నాకు సోముపాత్ర ద‌క్కింది. మ‌ళ్లీ మార్కులు కొట్టేశాడు రాజేశ్. దీనిని దృష్టిలో పెట్టుకొనే స‌లీమ్-జావేద్ తాము ర‌చ‌న చేసిన దీవార్లో అమితాబ్ పాత్ర క‌న్నుమూసేలా చూశారు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. అదే యేడాది వ‌చ్చిన షోలే క‌థ‌ను కూడా స‌లీమ్-జావేద్ రాశారు. అందులో చివ‌ర‌కు క‌న్నుమూసే జ‌య్ పాత్ర‌ను ముందుగానే వారు అమితాబ్ కు కేటాయించారు. వీరు పాత్ర‌ను ధ‌ర్మేంద్ర ద‌క్కించుకున్నారు. షోలే చిత్రంతో గ‌బ్బ‌ర్ సింగ్ పాత్ర పోషించిన ఆంజాద్ ఖాన్, జయ్ గా న‌టించిన అమితాబ్ మంచి పేరు సంపాదించ‌డం అంద‌రికీ తెలిసిందే! ఇలా చివ‌ర‌లో మ‌ర‌ణించే పాత్ర‌ల‌తోనూ న‌టులుగా మంచిపేరు సంపాదించుకున్న‌వారూ ఉన్నారు.

అయితే స‌మ‌స్యంతా సింగిల్ రోల్ లో న‌టించిన హీరో పాత్ర తుద‌కు క‌న్నుమూస్తే ఆ విషాదాంతం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు అల‌రిస్తుంది అన్న‌దే! ఇలా ప్ర‌య‌త్నించ‌డం సాహ‌స‌మే అవుతుంది. అలాంటి సాహ‌సాలు చేసి చాలామంది దెబ్బ‌తిన్నారు. మ‌హేశ్ బాబు హీరోగా బాబీ సినిమాలో ఆయ‌న పాత్ర క‌థానుగుణంగా అంత‌మ‌వుతుంది. అయితే హీరో చ‌నిపోతే చూడ‌ర‌ని, మ‌ర‌ణం త‌రువాత కూడా కాసింత క‌థ‌ను న‌డిపారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. కానీ, ‘ధూమ్ 3’లో హీరో ఆమీర్ ఖాన్ పోషించిన రెండు పాత్రలూ చివరలో నదిలో పడేలా ముగింపు ఉంది. అయినా సూపర్ హిట్ అయ్యింది. క‌థ ముగింపు విషాద‌మైనా, సంతోష‌మైనా ప్రేక్ష‌కుణ్ని ఆక‌ట్టుకొనేలా రూపొందించాలి. లేక‌పోతే ఎన్ని మ‌సాలాలు ద‌ట్టించినా లాభం ఉండ‌దు. ఈ స‌త్యాన్ని తెలుసుకొనే ర‌చ‌యిత‌లు క‌థ‌లు రూపొందిస్తూ ఉంటారు. ద‌ర్శ‌కులు అందుకు త‌గ్గ మార్పులూ చేర్పులూ చేస్తుంటారు. మ‌రి తాజాగా వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్ సినిమాలో హీరో పాత్ర చ‌నిపోవ‌డం జ‌నాన్ని ఏ తీరున‌ ఆక‌ట్టుకుంటుందో, ఈ చిత్రానికి జ‌నం ఏ తీర్పును ఇస్తారో చూడాలి!

-Advertisement-విషాదాంతం… జనాన్ని ఆక‌ట్టుకుంటుందా!?

Related Articles

Latest Articles