సంక్రాంతి సినిమా సంబరాలు సాగేనా!?

ఈ సంక్రాంతికి ఒకే ఒక్క టాప్ స్టార్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ జనం ముందుకు వస్తోంది. జనవరి 14న ‘బంగార్రాజు’ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున నటవారసుడు నాగచైతన్య సైతం నటించడం విశేషం. కాగా, వీరిద్దరూ కలసి ఇంతకు ముందు నటించిన ‘మనం’ అప్పట్లో ఘన విజయం సాధించిది. ఇక నాగార్జున తరం హీరోలతో పోలిస్తే సంక్రాంతి సంబరాల్లో ఆయన తక్కువగానే పాల్గొన్నారని చెప్పాలి. అయితే 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో పొంగల్ బరిలోకి దూకి, అందరికన్నా మిన్నగా విజయం సాధించారు. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ‘బంగార్రాజు’తో మళ్ళీ మునుపటి మ్యాజిక్ చేస్తారని నాగార్జున అభిమానులు ఆశిస్తున్నారు. పైగా ఈ సారి ఎన్ని సినిమాలు వస్తోన్నా, నాగార్జున ‘బంగార్రాజు’ మాత్రమే అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అందుకు నాగార్జున, నాగచైతన్య కలసి నటించడం ఓ కారణం కాగా, మిగిలిన స్ట్రెయిట్ మూవీస్ అన్నిటా చిన్నహీరోలే ఉండడంతో ఫోకస్ ‘బంగార్రాజు’ మీదే ఉంది.

ఒమిక్రాన్ వేరియంట్ తో కరోనా కల్లోలం మళ్ళీ మొదలయిందని, అందువల్లే ముందుగా బరిలోకి దూకుతాయనుకున్న భారీ చిత్రాలు వెనక్కి వెళ్ళాయని అందరికీ తెలుసు. కానీ, తెలుగు, తమిళ జనాలకు సినిమా పండగను అందించేది పొంగల్ అనే చెప్పాలి. ఈ సారి పొంగల్ బరిలో నాగ్ సినిమా ఒక్కటే ఉండడం సినీ ఫ్యాన్స్ కు కొంత నిరుత్సాహం కలిగిస్తోన్నమాట వాస్తవం. పైగా, ముందుగా ‘ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్’ సంక్రాంతి సందడిలో పాల్గొంటాయని ఊరించారు. అవి కాస్తా వెనకడుగు వేసే సరికి సినీ ఫ్యాన్స్ కు నిరుత్సాహం కలిగింది. ఆ నిరుత్సాహాన్ని’బంగార్రాజు’ మెల్లగా కరిగిస్తారని సినీజనం ఆశిస్తున్నారు.

గడచిన పదేళ్ళ పొంగల్ హంగామాను గుర్తు చేసుకుంటే, ఈ సారే మరీ చప్పగా ఉందని అంటున్నారు. లాక్ డౌన్ తరువాత తొలి పొంగల్ హంగామా గత ఏడాది సాగింది. అప్పుడు విడుదలైన “క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్”లో రవితేజ ‘క్రాక్’ విజేతగా నిలచింది. అంతకు ముందు అంటే 2020 పొంగల్ బరిలో మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల…వైకుంఠపురములో’ విడుదల కాగా, రెండు సినిమాలూ వసూళ్ళ వర్షాలు కురిపించాయి. రన్ లో ‘అల…వైకుంఠపురములో’ పైచేయి సాధించి, మరింత ముందుకు వెళ్ళే సమయంలోనే లాక్ డౌన్ పడింది.

ఇప్పుడే కాదు, యన్టీఆర్, ఏయన్నార్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న రోజుల నుంచీ సంక్రాంతికి టాప్ స్టార్స్ నుండి ఏదో రకంగా ప్రత్యేకత సంతరించుకున్న చిత్రాలు విడుదలయ్యేవి. ఆ పంథా ఇప్పటికీ కొనసాగుతోంది. కరోనా కారణంగా ఈ సారి ఆ హంగామా తారుమారయి ఉండవచ్చు. అలా నిరుత్సాహ పడ్డవారికి ‘బంగార్రాజు’, ఆయనతో పాటు వచ్చే చిన్న హీరోల సినిమాలు వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ దశాబ్దంలో వరుసగా నాలుగు సంక్రాంతులకు సినిమాలు విడుదల చేసిన టాప్ స్టార్ గా బాలకృష్ణ నిలిచారు. బాలకృష్ణ నటించిన “డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా, యన్టీఆర్- కథానాయకుడు” చిత్రాలు 2016 నుండి 2019 వరకు వరుసగా నాలుగు సంక్రాంతుల సంబరాల్లో పాల్గొన్నాయి. వీటిలో బాలయ్య నూరవ చిత్రంగా విడుదలైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఘనవిజయం సాధించింది. ‘అఖండ’ వచ్చే వరకు బాలయ్య చిత్రాలలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’యే టాప్ గ్రాసర్ కావడం విశేషం! ఇక వరుసగా మూడు సంక్రాంతులకు సినిమాలు విడుదల చేసిన యంగ్ స్టార్స్ లో మహేశ్ బాబు ఉన్నారు. 2012 పొంగల్ బరిలో ‘బిజినెస్ మేన్’గా దూకిన మహేశ్ తరువాత 2013లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తోనూ, 2014లో ‘1: నేనొక్కడినే’తోనూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అయితే ‘హ్యాట్రిక్’ మిస్సయ్యారు.

చిరంజీవి రీ ఎంట్రీగా విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’ ఆయన కెరీర్ లో 150వ సినిమాగా 2017 సంక్రాంతికి జనం ముందు నిలచింది ఘనవిజయం సాధించింది. ‘సైరా…నరసింహారెడ్డి’కి ముందు చిరంజీవి కెరీర్ లో టాప్ గ్రాసర్ ‘ఖైదీ నంబర్ 150’ కావడం గమనార్హం! ఇక 2016 సంక్రాంతి బరిలో నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో సందడి చేశారు. ఇప్పటి దాకా నాగ్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా ఈ మూవీనే నిలచి ఉంది. మహేశ్ బాబు కెరీర్ లో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రంగా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలచింది. ‘పుష్ప’కు ముందు అల్లు అర్జున్ కు టాప్ గ్రాసర్ ఏదంటే ‘అల… వైకుంఠపురములో’. ఇలా ఎలా చూసినా, పొంగల్ హంగామా తెలుగు సినిమాకు భలేగా కలసి వచ్చేది. టాప్ స్టార్స్ సినిమాలు ఏదో విధంగా రికార్డులు సృష్టించేవి.

2020 సంక్రాంతి చిత్రాలు లాక్ డౌన్ పడక పోయి ఉంటే, ఎలాంటి ‘రన్’ చూసేవో తెలియదు. కానీ, ఆ తరువాత నుంచీ కరోనా కారణంగా పొంగల్ హంగామా మునుపటిలా సాగడం లేదు. 2022 సంక్రాంతికి “ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్, బంగార్రాజు” వంటి బిగ్ మూవీస్ హంగామా చేస్తాయని సినీఫ్యాన్స్ ఆశించారు. కానీ, తాము పెట్టిన బడ్జెట్స్ వర్కవుట్ కావాలంటే ప్రస్తుత పరిస్థితులు సహకరించవని తెలుసుకున్న వారు వెనక్కివెళ్ళారు. ప్రతి సంక్రాంతికి మన స్ట్రెయిట్ మూవీస్ తో పాటు, కొన్ని డబ్బింగ్ సినిమాలూ హంగామా చేసేవి. ఈ సారి కూడా అలా సందడి చేసే చిత్రాలు ఉంటాయా? ఎందుకంటే విశాల్ ‘సామాన్యుడు’, అజిత్ ‘వలిమై’ వస్తాయని ప్రకటించినా… విశాల్ వెనడుగు వేశాడు. అజిత్ ‘వలిమై’ సైతం పోస్ట్ పోన్ అయ్యింది. ఏది ఏమైనా, మొదటి నుంచీ సంక్రాంతి సందడిలో పాల్గొంటామని చెబుతూనే వస్తోన్న నాగార్జున ‘బంగార్రాజు’ మాత్రం ప్రస్తుతానికి బరిలోనే ఉంది. మరి ఈ స్టార్ హీరో మూవీ గత మాసం ‘అఖండ’ ఆరంభించిన జైత్రయాత్రను కొనసాగిస్తుందేమో చూద్దాం!

Related Articles

Latest Articles