చిరంజీవి – ప్రకాశ్ రాజ్ ఎక్కడా తగ్గట్లేదు!

చిరంజీవి సోమవారం గోపీచంద్ మూవీ ‘సీటీమార్’ ట్రైలర్ చూసి, దర్శకుడు సంపత్ నందితో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ నెల 10వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాను చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, యంగ్ హీరో ఆది పినిశెట్టి ‘క్లాప్’ మూవీ టీజర్ ను సైతం చిరంజీవి విడుదల చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘క్లాప్’ విజయం కావాలని కోరుకున్నారు. చిత్రం ఏమంటే… గత కొన్ని రోజులుగా చిరంజీవి ఎడాపెడా పలు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ తన నివాసం నుండే జరుపుతున్నారు. అడగటం ఆలస్యం అన్నట్టుగా వారికి తన మాట సాయం అందించి, మూవీస్ కి ప్రచారం చేసిపెడుతున్నారు. ఇది అభినందించదగ్గదే.

జాగ్రత్తగా గమనిస్తే… ఇదే పని గత కొన్ని రోజులుగా జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం చేస్తున్నారు. గతంలో పరాయి చిత్రాల ప్రచారానికీ, మీడియాకు శుభాకాంక్షలు చెప్పడానికి ససేమిరా అంటుండే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు ఫ్రెండ్లీ స్టార్ అయిపోయారు. చిన్న చితకా సినిమాల దర్శక నిర్మాతలు కోరినా… వాళ్ళ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియోస్, పాటలు, ప్రచార చిత్రాలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఆదివారం కూడా ‘1997’ అనే సినిమాకు సంబంధించి హీరో డాక్టర్ మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే… జాగ్రత్తగా గమనిస్తే… వీరి విశాల హృదయ ప్రదర్శన వెనుక త్వరలో జరుగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కారణం కాదు కదా! అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి చిరంజీవి గతంలోనూ తనకు నచ్చిన, తాను మెచ్చిన సినిమాలను, సినిమా వాళ్ళనూ మనఃస్ఫూర్తిగా ప్రోత్సహించారు. కాకపోతే… ఇప్పుడది మరింత విస్తారంగా జరుగుతోంది. అలానే ప్రకాశ్ రాజ్ సైతం తన సహాయసహకారాలను సమాజంలోని అన్ని వర్గాలకూ అందించే నైజం ఉన్నవారే. కానీ ఇప్పుడు మాత్రం ‘మా’ ఎన్నికల కారణంగా ఇదంతా చేస్తున్నారేమోననే సందేహం కొందరికి కలుగుతోంది. ‘మా’ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో సంబంధం లేకుండా ఇదే విధంగా చిన్న సినిమాలను వీరు ప్రోత్సహిస్తే… ఆ విమర్శకుల నోళ్ళును మూసినట్టు అవుతుంది. అదే జరగాలని కోరుకుందాం!

చిరంజీవి - ప్రకాశ్ రాజ్ ఎక్కడా తగ్గట్లేదు!
చిరంజీవి - ప్రకాశ్ రాజ్ ఎక్కడా తగ్గట్లేదు!

Related Articles

Latest Articles

-Advertisement-