ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొందా…?

ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొందా? వ్యక్తిగత అజెండాలతో ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటున్నారా? అధిష్ఠానం అక్షింతలు వేస్తేతప్ప.. ఏం చేయాలో తెలిసి రాలేదా? వెనక సీట్లో కూర్చుని డ్రైవింగ్‌ చేస్తోంది ఎవరు? ఎందుకీ సందిగ్ధత? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని రాజకీయం చేస్తారా లేక.. పాత పంథాలోనే వెళ్తారా?

అమిత్‌ షా తలంటాకే అమరావతి రైతులకు బీజేపీ మద్దతు..!

అయోమయం.. గందరగోళం.. స్పష్టత లేని విధానాలు..! ప్రస్తుతం ఏపీ బీజేపీ వీటి చుట్టూనే తిరుగుతోంది. ఇటీవల తిరుపతిలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఇది మరోసారి బయటపడింది. కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం.. భిన్నాభిప్రాయాలకు తావులేదు అని చెప్పుకొనే కమలనాథుల మాటల్లోని డొల్లతనం తెలిసిపోయింది. వ్యక్తిగత అజెండాలతో ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకునే పరిస్థితి..! అమిత్‌ షా తలంటిన తర్వాతే.. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారంటే కాషాయ శిబిరంలోని గందరగోళానికి అద్దం పడుతుంది.

వీర్రాజు, దేవధర్‌లు సొంత అజెండాలతో వెళ్తున్నట్టు ఫిర్యాదు..!

గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాదబాబు, సీనియర్‌ నేత పాతూరు నాగభూషణం తదితరులు అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ఇది తెలిసిన వెంటనే ఏపీ బీజేపీ కో ఇంఛార్జ్‌ సునీల్ దేవధర్‌ వాళ్లకు ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారట. రైతుల ఉద్యమాన్ని టీడీపీ వాళ్లు హైజాక్‌ చేశారు.. అలాంటి కార్యక్రమాల్లో మీరెలా పాల్గొంటారని నిలదీశారట దేవధర్‌. దాంతో బీజేపీ నేతలు సందిగ్ధంలో పడ్డారు. అంతకుముందు బీజేపీని పార్కింగ్‌ ప్లేస్‌గా వాడుకోవడానికి కొందరు చూస్తున్నారని దేవధర్‌ కామెంట్స్‌ చేశారు. అలాంటి వాళ్ల కార్ల టైర్లను పంక్చర్‌ చేసి బీజేపీలోనే ఉంచేస్తామని ఆయన అన్నారు. దీనిపై బీజేపీలో చర్చ జరిగింది. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ల గురించే దేవధర్‌ ఈ వ్యాఖ్యలు చేశారని అనుకున్నారంతా. తిరుపతిలో అమిత్‌ షాతో జరిగిన భేటీలో అమరావతి రైతుల ఉద్యమం.. పార్కింగ్‌ స్లాట్‌ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు.. ఇంఛార్జ్ దేవధర్‌లు సొంత అజెండాలతో వెళ్తున్నట్టు వారిపై కంప్లయింట్లు వెళ్లాయట. ఆ అంశాలపై అమిత్ షా సీరియస్‌ అయినట్టు సమాచారం. ఆ తర్వాతే అమరావతి రైతలు ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. షా క్లాస్ తీసుకున్నాకే ఈ ప్రకటన రావడం విశేషం.

ఇంతకాలం బీజేపీ నేతలు ఎవరిపై పోరాటం చేశారు?
గాలిలో బాణాలు వేసి కాలం వెళ్లదీస్తున్నారా?

వెనక సీట్లో కూర్చొని డ్రైవింగ్‌ చేయొద్దని ఇద్దరు కీలక నేతలను ఉద్దేశించి అమిత్ షా చేసిన కామెంట్స్‌ ఇప్పటికీ పార్టీలో చర్చగానే ఉన్నాయి. ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఎవరితో పోరాటం చేయాలో షా స్పష్టత ఇచ్చారు. బీజేపీకి అధికార వైసీపీ శత్రువే అని తేల్చేశారు షా. అంటే.. ఇంతకాలం ఏపీలో బీజేపీ నేతలు ఎవరిపై పోరాటం చేశారు? షా చెప్పేంత వరకు వారు ఎందుకు తెలుసుకోలేకపోయారు? గాలిలో బాణాలు వేసి కాలం వెళ్లదీస్తున్నారా? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

స్టీల్‌ ప్లాంట్‌ సమస్యకు ప్రత్యామ్నాయం ఉందని అమిత్‌ షా చెప్పేవరకు తెలియదా?

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని మరోసారి నినదిస్తూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో బీజేపీ నేతలు తెలుసుకోలేకపోయారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మోడీ సర్కార్‌ దగ్గర ఒక ప్రత్యామ్నాయం ఉన్నట్టు అమిత్‌ షా వెల్లడించారట. తిరుపతి మీటింగ్‌లో దాని గురించి షా చెబుతుంటే నోరెళ్లబెట్టారట ఏపీ బీజేపీ నేతలు.
మరి ఇంతకాలం వీళ్లంతా ఏం చేశారు? కేంద్రంలోని తమ ప్రభుత్వ పెద్దలతో ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదు.

మిత్రపక్షం జనసేన.. శత్రుపక్షంతో కలిసి ఎన్నికల్లో పోటీచేసినా అడగలేని పరిస్థితి..!

ఇక మిత్రపక్షం జనసేనను కలుపుకొని వెళ్లే విషయంలోనూ ఏపీ బీజేపీ నేతల తీరుపై ఢిల్లీ నాయకత్వం అసంతృప్తితోనే ఉంది. అమిత్ షా మీటింగ్‌లో అదీ వెల్లడైంది. పవన్‌ కల్యాణ్ మన మిత్రుడు.. ఆయన్ని ఎందుకు కలుపుకొని వెళ్లడం లేదని షా నిలదీయడంతో వీర్రాజు అండ్‌ కో ముఖాల్లో నెత్తురు చుక్కలేదని చెబుతున్నారు. బీజేపీ నేతలు చేరదీయకపోవడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసింది జనసేన. ఇలా మిత్రపక్షం.. తమ శత్రుపక్షంతో కలిసి ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకుని వెళ్తున్నా వాళ్లను అడగలేని పరిస్థితిలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉంది.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటూ రాలేదు..!

బద్వేల్‌ ఉపఎన్నికలో పోటీ చేసి.. అక్కడ వచ్చిన ఓట్లతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్న ఏపీ బీజేపీ నేతలు.. ఇటీవల ఏపీలో ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఒక్క సీటు రాలేదని గుర్తించలేకపోతున్నారు. మిత్రపక్షంగా చెప్పుకొనే జనసేన కొన్నిచోట్ల గెలిచింది కానీ.. కమలం ఎక్కడా వికసించలేదు. మరి.. షా మీటింగ్‌ తర్వాతైనా ఈ అంశాలపై ఏపీ బీజేపీ నేతలు తెలివి తెచ్చుకుని ప్రవర్తిస్తారో లేక పాతపంథాలోనే వెళ్తారో చూడాలి.

Related Articles

Latest Articles